వివాహం చేసుకుంటానని నమ్మబలికి ప్రేమాయణం సాగించిన వ్యక్తి మొహం చాటేస్తున్నాడంటూ ఓ గిరిజన వితంతువు శనివారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దేవరాపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పంచాయతీ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న రక్షిత మంచినీటి పథకం ట్యాంకు పైకి ఎక్కి ఆమె దూకడానికి సిద్ధపడింది. చివరికి పెళ్లి చేసుకుంటానని ప్రేమించిన వ్యక్తి మాటివ్వడంతో కిందకు దిగింది.

యువతికి సుమారు నాలుగేళ్ల క్రితం చెన్నైకి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోవడంతో ఆమె కుమారుడ్ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తన దగ్గర బంధువైన అనంతగిరి మండలం పెదకోట గ్రామానికి చెందిన శిరగం మౌళితో వివాహేతర సంబంధ కొనసాగిస్తోంది. మౌళికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కాగా తనను రెండో పెళ్లి చేసుకోవాలంటూ కొన్ని నెలల నుంచి అతనిపై ఒత్తిడి చేస్తోంది. పెదకోట పంచాయతీలో గ్రామసేవకుడి (వీఆర్‌ఏ)గా ఉద్యోగం చేస్తుండటంతో రెండో వివాహం చేసుకోవడానికి అతను వెనుకంజ వేశాడు.

ఆ యువతి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మళ్లీ దేవరాపల్లి పంచాయతీ కార్యాలయానికి ఆనుకుని ఉన్న మంచినీటి పథకం ట్యాంకు పైకి ఎక్కింది. మౌళితో పెళ్లి చేస్తే తప్ప తాను కిందకు దిగనని, లేకుంటే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో మౌళి ఆమెను బతిమాలి కిందకు దించడానికి తానూ పథకం పైకి ఎక్కాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో ఆమె ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుని కిందకు దిగింది.