నీట్ పరీక్ష సమయంలో ఓ బాలికను బ్రా తొలగించమని బలవంతం చేసిన వారిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. నీట్‌ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలికను బలవంతంగా ఇన్నర్‌వేర్‌ను తొలగించిన ఘటనపై కేరళ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్‌లు 354, 509ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరుకావడానికి ముందు ఒక బాలిక తన లోపలి దుస్తులను బలవంతంగా తొలగించిన ఘటనపై కేరళ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కొల్లం రూరల్ పోలీస్ జిల్లా పరిధిలోని చడయమంగళం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మహారాష్ట్రలోని వాషిమ్ కళాశాల నీట్ పరీక్షాకేంద్రంలోనూ బుర్ఖా, హిజాబ్‌ను తొలగించారని ఇద్దరు నీట్ ఆశావహులు పేర్కొన్నారు. ”పరీక్షా కేంద్రంలో విద్యార్థులను పరీక్షించే ఏజెన్సీని మేం గుర్తించాలి, ఆపై వారి ఇన్నర్‌వేర్ తొలగించమని ఆరోపించిన మహిళను కనుగొనవలసి ఉంటుంది” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

ఆదివారం నీట్ పరీక్ష జరిగిన తర్వాత ఈ ఘటనపై బాలిక తండ్రి కొల్లం రూరల్ ఎస్పీ కెబి రవికి ఫిర్యాదు చేశారు, ఈ సంఘటనపై విచారణ జరపాలని కోరారు. కొల్లాంలోని ఆయుర్‌లోని మార్ థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో పరీక్షకు హాజరైన చాలా మంది విద్యార్థినులకు తమ ఇన్నర్‌వేర్లను బలవంతంగా తొలగించారని ఫిర్యాదులో తండ్రి ఆరోపించారు. అయితే ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్దేశించిన నిబంధనల ప్రకారం లేదు.
తన కూతురు ఇన్నర్‌వేర్‌ను తొలగించేందుకు నిరాకరించడంతో పరీక్షకు హాజరు కావద్దని చెప్పారని బాలిక తండ్రి చెప్పారు. విద్యార్థినులు తమ ఇన్నర్‌వేర్‌లను తీసివేయడానికి నిరాకరించినప్పుడు, వారి భవిష్యత్తు ముఖ్యమా లేదా ఇన్నర్‌వేర్ ముఖ్యమా అని అడిగారని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.పరీక్షా కేంద్రమైన మార్ థామస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ప్రతినిధి మాట్లాడుతూ, బ్రా తొలగింపు విషయంలో తమ విద్యా సంస్థ ప్రమేయం లేదని, విద్యార్థులను పరీక్షించే బాధ్యతను ఎన్టీఏ నియమించిన ఏజెన్సీ సిబ్బందిదని పేర్కొన్నారు.