కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్యాక్స్ (Tax) అధికారులు చెల్లించాల్సిన పన్ను బకాయిలకు సంబంధించి రీఫండ్‌ల (Tax Refund) సర్దుబాటుపై నిర్ణయం తీసుకునే సమయాన్ని 21 రోజులకు తగ్గించింది. దీని వల్ల ట్యాక్స్ పేయర్లకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ట్యాక్స్ అధికారులకు ఇదివరకు 30 రోజుల వరకు గడువు ఉండేది. అయితే ఇప్పుడు ఈ కాల పరిమితిని 21 రోజులకు తగ్గించినట్లు ఆదాయపు పన్ను డైరెక్టరేట్ (సిస్టమ్స్) తెలిపింది. పన్ను చెల్లింపుదారులు రిఫండ్ సర్దుబాటుకు అంగీకరించకపోయినా లేదా పాక్షికంగా అంగీకరించినా, ఆ విషయాన్ని సీపీసీ తక్షణమే ట్యాక్స్ అధికారులకు సూచించాల్సి ఉంటుంది. ఇలా సూచించిన తేదీ నుంచి 21 రోజులలోపు రిఫండ్ సర్దుబాటుకు సంబంధించి ట్యాక్స్ అధికారులు సీపీసీకి వారి నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ పేయర్ నుంచి వచ్చిన ప్రతిస్పందనపై ఏవో (అసెస్సింగ్ ఆఫీసర్) నుండి ఫీడ్‌బ్యాక్ లేకపోవడంతో రిఫండ్ సర్దుబాటులో తప్పులు దొర్లుతున్నాయని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) గమనించింది. దీని వల్ల అనవసరమైన ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంది. అంతేకాకుండా పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఓ వెంటనే స్పందించకపోవడం మరో ఆందోళన కలిగంచే అంశం.

కొత్త ఆదేశాల ప్రకారం చూస్తే: ఇప్పుడు అసెస్సింగ్ ఆఫీసర్‌కే కేవలం 21రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ట్యాక్స్ పేయర్ల ఫిర్యాదుకు అసెస్సింగ్ ఆఫీసర్ స్పందించాల్సి ఉంటుంది. ఇదివరకటి మాదిరి 30రోజుల వరకు కూడా గడువు ఉండదు. దీంతో నిర్ణీత గడువు దాటిన తర్వాత సీపీసీ రిఫండ్స్‌ను తన వద్ద ఉంచుకునే అవకాశం ఉండదు. దీని వల్ల త్వరితగతిన రిఫండ్ సర్దుబాటు పూర్తవుతుంది. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 245 ప్రకారం ట్యాక్స్ డిమాండ్‌కు సంబంధించి రిఫండ్ సర్దుబాటుకు అస్సెసింగ్ ఆఫీసర్‌కు అధికారం ఉంటుంది. ట్యాక్స్ పేయర్లు ట్యాక్స్ డిమాండ్‌కు సంబంధించి తప్పులు ఉంటే.. ఫిర్యాదు చేయొచ్చు. డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రకారం చూస్తే.. అస్సెసింగ్ ఆఫీసర్లకు వారి స్పందన తెలియజేయడానికి 30 రోజులు గడువు ఉన్నా కూడా, చాలా సందర్భాల్లో గడువులోగా స్పందన తెలియజేయడం లేదు. దీని వల్ల రిఫండ్స్ జారీలో ఆలస్యం జరుగుతోంది. దీంతో ట్యాక్స్ పేయర్ల నుంచి ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి.