‌వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి అంత్యక్రియలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. శారారాణి గుండె పోటుతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. హుజూర్‌నగర్‌కు చెందిన శారారాణితో పాటు తల్లిదండ్రులు సూర్యాపేట బాప్టిస్ట్‌ చర్చి సంఘానికి చెందిన సభ్యులు కావడంతో ఆమె భౌతికకాయాన్ని ఆదివారం ఇక్కడ సమాధి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో శారారాణి పార్థివ దేహాన్ని సూర్యాపేట బాప్టిస్ట్‌ చర్చికి తరలించారు. చర్చి ఫాస్టర్‌ ప్రభుదాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొద్దిసేపు చర్చిలో బంధువులు, స్నేహితుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు సమీపంలోని క్రైస్తవుల శ్మశాన వాటిక (సమాధుల తోట)లో బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. 2004 సంవత్సరంలో ఈమె తెరాస నుంచి పరకాల శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో గత ఆరేళ్లుగా స్తబ్దుగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు భర్త విశ్రాంత అదనపు ఏసీపీ ఆర్డీఎస్‌ బండారితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అంత్యక్రియల్లో బాప్టిస్ట్‌ చర్చి పాస్టర్‌ ప్రభుదాస్‌, పురపాలిక కోఆప్షన్‌ సభ్యురాలు స్వరూపారాణి, పూర్ణశశికాంత్‌, కెనడీ, రాజన్‌, మెలంటన్‌, నవీన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.