వివాహ వేడుకలో జరిగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పరస్పర దాడులకు దారి తీసింది . వధువు , వరుడు తరపు బంధువులు కొట్లాటకు దిగారు . ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి . స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి . ఉప్పుసాకకు చెందిన అజ్మీరా కుమారి వివాహం కొత్తగూడేనికి చెందిన లావుడ్యా ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఉదయం ఉప్పుసాకలోని వధువు ఇంటి వద్ద జరిగింది . వివాహం అనంతరం భోజనాల వద్ద వరుడి తరపు బంధువులు మటన్ తో భోజనం వడ్డించాలని వధువు తరుపు బంధువులతో గొడవకు దిగారు . మటన్ పెట్టే స్తోమత లేదని, చికెన్ తో భోజనాలు చేయాలని వధువు తరపు బంధువులు నచ్చ జెప్పేందుకు యత్నించారు . ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి గొడవ ఎక్కువైంది . భోజనాలు చేసేందుకు వేసిన కుర్చీలు తీసుకుని ఒకరిపై ఒకరు భౌతికదాడులకు దిగారు . సుమారు వంద కుర్చీలు విరిగిపోయాయి . ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి . మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి . ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు .