ఏ వయసుకు ఆ ముచ్చట! ఇది ఒకప్పటి మాట. పిల్లలు పెళ్లీడుకు రాగానే సంబంధాలు వెతకటం, వీలైనంత త్వరగా మూడు ముళ్లు వేయించటం. అనంతరం సీమంతాలు, పురుళ్లు. వయసుకు వచ్చిన పిల్లలు, కొత్త జంటలతో కళకళలాడే ప్రతి ఇంటా ఇలాంటి వాతావరణమే కనబడేది. కానీ ఇప్పుడో? 30 ఏళ్లు దాటినా ఎవరూ పెళ్లి మాటే ఎత్తటం లేదు. పెళ్లి చేసుకున్నా వీలైనంతవరకు సంతానాన్ని వాయిదా వేసుకోవటానికే ప్రయత్నిస్తున్నారు. ఆయుర్దాయం పెరగటం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారటం. మొత్తంగా సమాజంలో మహిళల పాత్ర, ప్రాధాన్యం పెరగటం వంటి అంశాలెన్నో ఇందుకు దోహదం చేస్తున్నాయి. సురక్షితమైన, సమర్థవంతమైన, చవకైన గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావటమూ పెద్ద మార్పే తీసుకొచ్చింది. మహిళలు సంతానాన్ని కనటంపై సొంత నిర్ణయం తీసుకోవటానికీ వీలు కల్పించింది. తల్లిదండ్రులు సైతం అమ్మాయిలను ముందుగా ఉన్నత చదువులు పూర్తి చేయటానికే ప్రోత్సహిస్తున్నారు.

ఈ క్రమంలో స్త్రీ జీవితంలో సంతానాన్ని కనటానికి అనువైన, విలువైన కాలం మించిపోతుండటమే విచారకరం. శారీరకంగా స్త్రీలకు 18-30 ఏళ్ల వయసు సంతానానికి అనువైన కాలం. మంచి ఆరోగ్యవంతమైన సంతానాన్ని కనటానికి ఇంతకు మించిన సమయం లేదనే చెప్పుకోవాలి. జీవితంలో పూర్తిగా స్థిరపడిన తర్వాతే పిల్లలను కనాలని భావిస్తున్న ఎంతోమంది దీన్ని పట్టించుకోవటమే లేదు. 35 ఏళ్లు దాటినా సంతానం వైపు చూడటం లేదు. ఆనక సంతానం కలగటం లేదని మథనపడుతూ, కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నవారు ఎందరో. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవటమే అన్నింటికన్నా ఉత్తమం. వీలున్నప్పుడే సంతానాన్ని కనొచ్చని, వచ్చిన ఇబ్బందేమీ లేదనే అపోహలు తొలగించుకోవాలి. వయసు పెరుగుతున్నకొద్దీ మామూలుగానే కాదు, కృత్రిమ పద్ధతులతోనూ గర్భధారణ కష్టమవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ గర్భం ధరించినా తల్లికీ బిడ్డకూ సమస్యలు, సవాళ్లు ఎదురవ్వొచ్చనీ గుర్తించాలి.