జార్ఖండ్‌లోని దేవఘర్‌ నగర మున్సిపాలిటీ బహిరంగ మూత్రవిసర్జన విముక్త ప్రాంతంగా గుర్తింపు పొందింది. కాగా ఇదే ప్రాంతానికి చెందిన ఒక మహిళ బహిరంగ మూత్ర విసర్జనకు సిగ్గుపడి, ఎలుకల మందు తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించిన ఉదంతం వెలుగు చూసింది. అయితే సమయానికి ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

బాధితురాలి భర్త సూరజ్ చంద్, ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఉదయం ఉన్నట్టుండి తన భార్య అనారోగ్యం పాలైందని, అసలు ఏం జరిగిందని ఆమెను ప్రశ్నించగా బహిరంగ మూత్ర విసర్జనకు సిగ్గుపడి ఎలుకల మందు తిన్నట్టు చెప్పిందన్నాడు. కాగా ఏడాది క్రితమే తాము మరుగుదొడ్డి నిర్మాణం కోసం దరఖాస్తు చేశామని, అయినా అధికారులు స్పందించలేదని వాపోయాడు. ఈ సందర్బంగా మున్సిపల్ అధికారి అశోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ తమకు ఈ ఉదంతం గురించి తెలియలేదని, పట్టణం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. అయినా ఈ ఉదంతం గురించి విచారణచేసి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.