ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్‌లో గీజర్‌ నుంచి లీక్‌ అయిన గ్యాస్‌ పీల్చుకొని ఊపిరాడక నవ వధువు మృత్యువాతపడింది. వివరాలు: ఇటీవల వివాహం అయిన వధువు స్నానం చేసేందుకు అత్తవారింట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ యువతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్రూమ్‌ డోర్‌ తట్టి చూడగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాత్రూమ్‌ తలుపులు పగలగొట్టగా ఓ మూలన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్‌ గీజర్‌లో నుంచి వెలువడిన కార్బర్‌ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే వధువు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ గ్యాస్‌ చాలా ప్రమాదకరమని పీల్చిన కొద్ది నిమిషాల్లోనే ఊపిరాకడ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

గ్యాస్‌ గీజర్‌ను ఉపయోగించిన ప్రతిసారి దాని నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలవుతుంది. ఇది ప్రాణాంతకమైనది. వీటిని బాత్‌రూమ్‌లో ఏర్పాటు చేసుకోకుండా ఉంటేనే మంచింది. వెంటిలేషన్‌ బాగా ఉండే ప్రదేశాల్లోనే ఫిట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే గ్యాస్‌ గీజర్ల నిర్వహణ ఖర్చు ఎలక్ట్రిక్‌ గీజర్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే దేశంలో వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇంట్లో గ్యాస్ గీజర్లను ఉపయోగించడం ప్రమాదకరమనే విషయం తెలిసిందే. ఇవి విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్‌ పీల్చిన కొద్ది నిమిషాల్లోనే కళ్లు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయిదు నిమిషాలు కార్బన్ మోనాక్సైడ్‌ గ్యాస్‌ పీల్చడం వల్ల తల తిరగడం అంతకంటే ఎక్కువ సమయం పీలిస్తే స్పృహ కోల్పోయి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది. శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల పాటు యాంటీ సీజర్‌ మందులతో చికిత్స చేయవచ్చు.