కొంతమంది రూ.లక్షల్లో రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టడంతో అదికాస్తా బ్యాంకు మేనేజర్‌ మెడకు చుట్టుకుని ఉరితాడయ్యింది, హాయిగా సాగిపోతున్న పచ్చని కాపురంలో చిచ్చురేపింది. భార్య, ఇద్దరు కుమార్తెల భవితవ్యం అగమ్యగోచరమయ్యింది. యానాం పోలీసుల కథనం ప్రకారం: పిఠాపురం మార్కెట్‌ ప్రాంతానికి చెందిన విస్పాప్రగడ సాయిరత్న శ్రీకాంత్‌(33) గతంలో మచిలీపట్టణంలో యూకో బ్యాంకు మేనేజర్‌గా పనిచేశారు. రొయ్యల చెరువుల సేద్యానికి అక్కడ కొంతమందికి లక్షలాది రూపాయలు రుణాలు ఇచ్చారు.

తీసుకున్న రుణాలను సంబంధిత వ్యక్తులు చెల్లించకపోవడంతో యాజమాన్యం మేనేజర్‌ శ్రీకాంత్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొంతమేర రుణాలను శ్రీకాంత్‌ వ్యక్తిగతంగా చెల్లించారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం శ్రీకాంత్‌ యానాం శాఖకు బదిలీ అయ్యారు. స్థానిక గోపాల్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం ఉదయం 8.00 గంటలకు భార్య కావ్యను పిల్లల్ని స్కూల్‌ వద్ద దింపేసి రావాలని శ్రీకాంత్‌ చెప్పడంతో ఆమె మూడవ తరగతి చదువుతున్న స్వరాగ, ఎల్‌కేజీ చదువుతున్న స్వరి్ణతను స్కూల్‌కు తీసుకువెళ్లారు. ఆమె ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా తెరవకపోవడంతో మరోమార్గంలో వెళ్లి చూడగా ఫ్యాన్‌కు శ్రీకాంత్‌ ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. స్థానికులు, భార్య కలిసి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.

అయినవారు కన్నీరుమున్నీరు
యానాం జీజీహెచ్‌లో కుమారుడి మృతదేహం వద్ద శ్రీకాంత్‌ భార్య, తల్లి బోరున విలపించారు. బ్యాంకుకు సంబంధించిన రుణాలు ఏదోలా తామే చెల్లిస్తామని చెబుతూ ఉన్నామని, అయిన్పప్పటికీ ఈ అఘాయిత్యానికి పాల్పడతాడని తాము ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సైతం ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ఒడిగడితే తాము నివారించామని, కాని ప్రస్తుతం విధి కాటేసిందని శ్రీకాంత్‌ మావయ్య చెప్పారు. తమను భుజాలపై ఎక్కించుకుని ఆడించిన నాన్న తమను శాశ్వతంగా విడిచి అందనిలోకాలకు వెళ్లిపోయాడని తెలియని శ్రీకాంత్‌ కుమార్తెల అమాయక చూపులు అందరిని కలిచివేశాయి. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బడుగు కనకారావు తెలిపారు.