మేఘాలు బద్ధలయ్యాయి. వరుణుడు విజృంభించాడు. తెలంగాణ వ్యాప్తంగా కుండపోత. ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు. అన్ని జిల్లాల్లో వానలు ఉతికి ఆరేస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా వాన పడుతోంది. అన్ని పట్టణాలు తడిచి ముద్దయ్యాయి. మూడు రోజులగా కురిసినవర్షంతో జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వందలాది ఎకరాలు నీట మునిగాయి. కాలు కూడా బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు(TS Schools) సెలవులు ప్రకటించారు.

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించడంతో ముఖ్యమంత్రి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, సీఎస్‌, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.