నగరంలోని పబ్బుల్లో అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. నగర ప్రజల ఉల్లాసం కోసం ఏర్పాటు చేసిన పబ్బులు అసాంఘిక కార్యకలాపాలను నిలయంగా మారుతున్నాయి. చాలా పబ్బులు నిబంధనలు పాటించకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలోని 48 పబ్బులు ఉండగా అన్నింటిపై కేసులు ఉన్నాయి. నిర్ణీత సమయం దాటినా కూడా పబ్బులను నడిపిస్తుండడం, పెద్ద పెద్ద సౌండ్ పెట్టడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి దాటినా కూడా పబ్బులు నడుస్తుండడంతో ఫిర్యాదులు వస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని లిస్బన్ పబ్బులో వ్యభిచారం నిర్వహిస్తుండడంతో 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న రెండు పబ్బులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

చాలా మంది పబ్బుల విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారు. జూబ్లిహిల్స్‌లో ఉన్న పబ్బులు ఎక్కువగా ఇళ్లమధ్య ఉండడంతో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. పెద్ద పెద్దగా సౌండ్స్ పెట్టడం, పబ్బులకు వచ్చే వారు రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్బులో నిర్ణీత సమయం దాటిన తర్వాత అందులో ఉన్న వారు బయటికి రాగా పక్క ఇంటి యజమాని అప్పుడే అమెరికా నుంచి వచ్చాడు అతడు ఇంట్లోకి వెళ్లేందుకు 25 నిమిషాలకు పైగా పట్టింది. ఇలాంటి సంఘటనలు జూబ్లీహిల్స్‌లో వీకెండ్‌లో సర్వాసాధారణంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కన్పించడంలేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ సమయంలో రాత్రి 11.30 గంటల వరకు, వీకెండ్ శుక్ర, శని, ఆదివారం రాత్రి 12.30 వరకు మూసివేయాలని నిబంధనలు ఉన్నా కొన్ని మాత్రమే దానిని పాటిస్తున్నాయి.

మిగతావి కేసులు నమోదు చేసినా కూడా మారడంలేదు. పోలీసులు విధించే జరిమానా కన్నా ఎక్కువగా వ్యాపారం జరుగుతుండడంతో నిర్ణీత సమయం దాటినా కూడా నడుపుతున్నారు. ఇటీవల నోవాటెల్ పబ్బులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ సినీ నటి సంజన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నిందితుడు పరారీలో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పబ్బుల్లో తరచూ జరుగుతున్నా ఆయా యాజమాన్యాలు బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నాయి. ఇవి బయటికి వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారని అక్కడికక్కడే సెటిల్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో జరిగిన గొడవ చాలా వివాదాస్పదమైంది. గొడవపడ్డ వారు బయటికి వచ్చి రోడ్డు మీదే కొట్టుకునే వరకు వెళ్లాయి, పోలీసులు వచ్చి వారిని పిఎస్‌కు తీసుకుపోయే వరకు రోడ్డు మీదే కొట్టుకున్నారు.