ముంబై: ఎంతో నమ్మకంగా సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీలోనే తిరుగుబాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు ఏక్‌నాథ్‌ షిండే. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ‍అయితే తాజాగా ఏక్‌నాథ్‌ షిండే వర్గంలోనే చీలకలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ఉద్ధవ్‌ థాక్రే వర్గం శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ మేరకు వెల్లడించింది. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోని 40 మందిలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు పేర్కొంది సామ్నా. ఏక్‌నాథ్‌ షిండేను బీజేపీ తాత్కాలికంగా ఆ పదవిలో కూర్చోబెట్టిందని పేర్కొనటం గమనార్హం. ‘ఆయన ముఖ్యమంత్రి పదవి ఏ క్షణమైనా కోల్పోతారని ప్రతిఒక్కరికి అర్థమైంది.

అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో షిండే వర్గం పోటీ చేయాలని భావించింది. కానీ, అందుకు బీజేపీ నిరాకరించింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్‌ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చెప్పటం పూర్తిగా తప్పు. 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారిలోని చాలా మంది బీజేపీతో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ’అని ఉద్ధవ్‌ థాక్రే వర్గం పేర్కొంది. ఏక్‌నాథ్‌ షిండే తనకు తాను, మహారాష్ట్రకు చాలా నష్టం చేశారని, రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టరని పేర్కొంది శివసేన. షిండేను తమ స్వప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకోవటం కొనసాగిస్తుందని తెలిపింది. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలను ఉద్ఘాటించింది. ప్రభుత్వం 40 మంది ఎమ్మెల్యేలతో నడుస్తోందని, వారంతా సీఎంఓ నియంత్రణలో ఉన్నారని పేర్కొంది. నిర్ణయాలన్నింటిని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తీసుకుంటున్నారని, ఆ నిర్ణయాలను షిండే ప్రకటిస్తున్నారని ఆరోపించింది.