పుట్టిన రోజు నాడే పరిచయం ఉన్న వ్యక్తి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన గాదం మానస కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె మరణంపై తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా కొత్త విషయాలకు బయటకు వస్తున్నాయి.

గత నెల 27న తన పుట్టిన రోజున బయటకు వెళ్లిన మానస అత్యాచారం, హత్యకు గురి కావడం ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే ఘటనకు బాధ్యుడైన పులి సాయిగౌడ్‌ అలియాస్‌ సాయికుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. పోలీసులు ఈ కేసును హత్యగా పేర్కొన్నప్పటికీ రక్తస్రావం వల్ల మానస చనిపోవచ్చన్న ప్రచారం సాగింది. అయితే ముమ్మాటికీ గాదం మానసది అత్యాచారం, హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ప్లాన్‌ ప్రకారమే:

అత్యాచారానికి ముందు మానసను నిందితుడు సాయికుమార్‌ తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తొంది. నిందితుడు పక్కా ప్రణాళికతోనే బలవంతంగా మానసపై అత్యాచారానికి పాల్పడిన క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించిందని సమాచారం. ఈ మేరకు చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. నిందితుడిపై మానస తిరుగుబాటు చేసే క్రమంలో ఆమె రెండు చేతులకు తీవ్ర గాయాలయయ్యాయని సమాచారం. అలాగే, తలపై సైతం తీవ్రంగా దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పాటు తలలో రక్తం సైతం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారని తెలిసింది.. కాగా ఈ కేసులో త్వరలోనే మరిన్ని కీలకాంశాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.