మహారాష్ట్రలో బీజేపీ కొత్త ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇదివరకే రాజీనామా చేసి మళ్లీ ఎన్సీపీ గూటికి చేరిపోయారు. 288మంది సభ్యులున్న శాసన సభలో 145మంది ఎమ్మెల్యేల బలం ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటుకి అవకాశం ఉంది.

బీజేపీకి అంత బలం లేకపోయినప్పటికీ గవర్నర్ టక్కుటమార విద్యలతో ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధమైన చర్యల్ని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. బుధవారం సాయంత్రోలోగా బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడంతో తనకు బలం లేదని స్పష్టంగా తెలిసిపోవడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలిగారు.

రాజీనామా చేస్తున్నా ! ఫడ్నవిస్ సంచలన ప్రకటన:

ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం ఫడ్నవిస్ ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అధికారం కట్టబెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు మేము ప్రయత్నించినప్పటికీ దురదృష్టవశాత్తూ శివసేన బేరసారాలకు దిగడం మొదలు పెట్టింది. ఎన్నికలకు ముందు శివసేనకు సీఎం పదవి ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని మేము అడిగినప్పుడు వాళ్లు నిరాకరించారు. హాస్యాస్పదంగా శివసేన తమకే మెజారిటీ ఉందంటూ చెప్పుకొచ్చింది. కానీ ఒక్క పార్టీ కూడా బలం నిరూపించుకోలేదు. అందుకే రాష్ట్రపతి పాలన వచ్చింది’’ అని పేర్కొన్నారు…

! ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా వారికి నా శుభాకాంక్షలు ! అభిప్రాయ భేదాల వలన ఆ ప్రభుత్వం సుస్థిర పాలన అందించలేకపోవచ్చు | ఒకప్పుడు కాంగ్రెస్ అంటేనే మండి పడే శివసేన ఇప్పుడు వారితో కలవడానికి సిద్దమవుతున్నారు. శివసేన కోసం చాలా ఎదురు చూశాం కానీ మాకు స్పందించకుండా ఎన్సీపీ-కాంగ్రెస్ పంచన చేరారు. మాతో గేటు దాటి రాని వారు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంటింటికీ వెళ్లారు: ఫడ్నవీస్