ప్రేమ పేరుతో యువతిని నమ్మించి పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని చేశాడు. ఆదివారం ఆ యువతి స్నానం చేస్తుండగా ప్రసవించింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆడ శిశువు పురిటిలోనే మృతిచెందింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్భన్‌ పరిధిలోని చిన్నబోనాల గ్రామంలో చోటుచేసుకుంది.. యువతికి అన్యాయం చేసిన యువకుడితోనే వివాహం జరిపించి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. చిన్నబోనాల గ్రామానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన ముత్యాల రాజు అనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు. మూడు నెలల నుంచి ఆ యువతి కడుపుఉబ్బుగా ఉండడంతో అనుమానించిన గ్రామస్థులు తల్లిదండ్రులకు విషయం చెప్పినా ఆమె అనారోగ్యంతో ఉందని మందులు వాడడం వల్ల పొట్ట ఉబ్బిందంటూ తల్లిదండ్రులు దాటవేశారు.

ఆదివారం ఆమె స్నానం చేస్తుండగా ప్రసవించి కేకలు వేస్తూ పడిపోవడంతో తల్లి చుట్టు పక్కల వారు అక్కడికి వెళ్లి చూశారు. నెలలు నిండకుండానే పుట్టిన ఆడ శిశువు మృతిచెంది ఉంది. పక్కనే పడిపోయిన యువతిని ఇంట్లోకి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకొని మృతిచెందిన శిశువును పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. టౌన్‌ సీఐ శ్రీనివాసచౌదరి అక్కడికి చేరుకొని శిశువును పరిశీలించి యువతిని 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన యువకుడితోనే వివాహం చేసి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు సీఐకి విన్నవించారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.