ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం సాగుతోంది. ఇప్పటికే మౌర్య లాంటి పెద్ద నేత బీజేపీకి ఝలక్ ఇచ్చి సమాజ్‌వాదీ పార్టీలోకి వెళ్లిన తర్వాత, సమాజ్‌వాదీ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ స్నేహితుడు హరి ఓం యాదవ్ బీజేపీలో చేరడం చర్చనీయం అయ్యింది. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీకి మరో కీలక నేత రాజీనామా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారనే వార్తలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే, సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేసేది ఎవరో కాదు, ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరబోతున్నారు. లక్నోలోని కాంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అపర్ణ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. అపర్ణ ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య. ఇప్పటివరకు అపర్ణ కానీ, ఆమె కుటుంబం కానీ, ఈ వార్తలను ఖండించకపోవడంతో ఊహాగానాలు పెరిగిపోయాయి.

ముగ్గురు బీజేపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీలు బీజేపీని వీడి ఎస్పీలో చేరిన తర్వాత పార్టీ ఫిరాయింపులపై రాజకీయ పార్టీల్లో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అపర్ణా యాదవ్ 2017 శాసనసభ ఎన్నికలలో లక్నోలోని కాంట్ ప్రాంతం నుండి సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు, అయితే ఆమె బిజెపి అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. మాజీ ఐపీఎస్ అధికారి అసీం అరుణ్ ఇవాళ(16 జనవరి 2022) బీజేపీ సభ్యత్వం తీసుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ అసీమ్‌ను పార్టీలో చేర్చుకోనున్నారు. కాన్పూర్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అసిమ్ అరుణ్ ఇటీవల స్వచ్ఛంద పదవీవిరమణ పథకం (వీఆర్‌ఎస్) కింద వీఆర్‌ఎస్ తీసుకొని బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ సభ్యత్వం తీసుకున్న తర్వాత తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతుండగా కనౌజ్‌లోని సదర్ స్థానం నుంచి అసిమ్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం కనిపిస్తోంది.