అనాతవరం ప్రసిద్ధ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ఒక యువకుడు శనివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. స్థానిక బోగాల తోటకు చెందిన పెదపూడి రవికుమార్‌(32)ను తలపై బలంగా కొట్టి సమీపంలో ఉన్న పంటబోదెలో పడేశారు. శనివారం రాత్రి 11గంటలకు కుమారుడికి బిస్కెట్‌ ప్యాకెట్లు తీసుకురావటానికి బయటకు వెళ్లి వచ్చాడు. భార్యతో మళ్లీ వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో భార్య లలిత భర్తకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో కంగారు పడి మామగారు త్రిమూర్తులకు చెప్పటంతో ఆయన రవికుమార్‌ స్నేహితులకు ఫోన్‌ చేసినప్పటికీ సమాచారం తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. వారి ఇంటికి కొద్ది దూరంలో రోడ్డు పక్కన రవికుమార్‌ మోటారు బైక్, చెప్పులు కనిపించాయి. పరిసర ప్రాంతాల్లో గాలించగా పక్కనే ఉన్న పంట బోదెలో రవికుమార్‌ విగత జీవుడై కన్పించాడు. దీంతో త్రిమూర్తులు ముమ్మిడివరం పోలీసులకు సమాచారం అందించారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంటబోదె లోంచి తీసి పరిశీలించగా తలపై బలమైన గాయాలు ఉండటంతో రవికుమార్‌ హత్యకు గురైనట్టు గుర్తించారు. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రవికుమార్‌కు ఆరేళ్ల క్రితం కొమానపల్లికి చెందిన లలితతో వివాహమైంది. వీరికి తొమ్మిది నెలల బాబు నిహాన్షు ఉన్నాడు. రవికుమార్‌ అనాతవరం సెంటర్‌లో మీ సేవ కేంద్రం నిర్వహించేవాడు. ఇటీవల ఇసుక, కంకర సరఫరా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. స్థానికుల కథనం ప్రకారం రవికుమార్‌ కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఒక వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం ఆమె భర్తకు తెలియడంతో ఆమెను వదిలివేశాడు. ఆమె తెలంగాణకు చెందిన మరో వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. తెలంగాణ వ్యక్తి రవికుమార్‌తో సంబంధం కొనసాగించవద్దని ఆమెను హెచ్చరించాడు. రవికుమార్‌కు కూడా ఫోన్లు చేసి హెచ్చరించాడు. కొన్ని నెలల క్రితం కొంతమంది యువకులు ముఖానికి ముసుగులు వేసుకుని రవికుమార్‌ ఇంటికి వచ్చి దాడికి యత్నించారు. వివాహేతర సంబంధం వల్లే రవికుమార్‌ హత్యకు గురయ్యాడని భావిస్తున్నారు. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అమలాపురం సీఐ సీహెచ్‌ కొండలరావు ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎస్‌ఐ కె.సురేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.