హిందూ సాంప్రదాయాలను కించపరిచినందుకు..

ముస్లిం సాంప్రదాయాలను ధిక్కరించినందుకు

శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళ హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ముస్లిం సమాజం బహిష్కరించింది. హిందూవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆమె ప్రవర్తించారని ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫాతిమాను ముస్లిం సమాజం నుంచి బహిష్కరించాల్సిందిగా కేరళ ముస్లిం జమాత్‌ కౌన్సిల్‌ (సీఎంజే) ఎర్నాకులం కౌన్సిల్‌ను ఆదేశించింది. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మోజో టీవీ జర్నలిస్ట్‌ కవిత జక్కలతో కలిసి రెహానా ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
అనేక ఘర్షణలో నడుమ పోలీసు బందోబస్త్‌తో ఇరుముడితో ఇద్దరూ కొండపైకి చేరుకున్నారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే గుడిని ముసివేస్తామని ప్రధాన అర్చకుడు హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారు వెనుదిరిగారు. కొండపైకి వీరి ప్రవేశం తీవ్ర అల్లర్లకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూ భక్తుల సాంప్రదాయలకు భంగం కలిగే విధంగా రెహానా వ్యవహించిందని..

ఆమెతో పాటు వారి కుటుంబాన్ని కూడా ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్లు కేరళ ముస్లిం జమాత్‌ కౌన్సిల్ ప్రకటించింది.