వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల పనితీరు ఇతర జిల్లా పోలీసులకు ఆదర్శంగా నిలుస్తుందని, ఇక్కడి పోలీసులు చాలా చక్కగా విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. పోలీసు కమిషనరేట్‌ అర్ధసంవత్సర నేర సమీక్షా సమావేశాన్ని భీమారంలోని శ్రీ శుభం ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై ఇక్కడి పోలీసుల పని తీరును ప్రశంసించారు.

నేరాలను నియంత్రించడంలో చురుకుగా పని చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం. హత్య ఘటనలో 21 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి 51 రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష పడే విధంగా కోర్టు తీర్పు ఇవ్వడం వరంగల్‌ పోలీసుల ఘనతేనని అన్నారు. దీనిపై దేశం మొత్తం వరంగల్‌ పోలీసులను పైకి ఎత్తుకుందన్నారు.

భూదందాలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. రెవెన్యూ శాఖాపరంగా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. సీపీ విశ్వనాథ్‌ రవీందర్‌ మాట్లాడుతూ… పోలీసులు ప్రజల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా పని చేయాలని అన్నారు. పోలీసు స్టేషన్‌లకు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడికి తప్పకుండా రసీదును ఇవ్వాలన్నారు. దీంతో ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్‌లలో నిర్వహిస్తున్న 15 వర్టికల్స్‌ విధానం అందరికి ఆమోదయోగ్యంగా ఉందన్నారు. ఇందులో హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారి వరకు పని విధానాన్ని విభజించి నిర్వర్తించడం జరుగుతుందన్నారు.