కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందన ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘సప్తగిరి’ పేరుతో అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం (Tirumala Special Entry Darshan) ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ రైలు, రోడ్డు మార్గం ద్వారా కొనసాగుతుంది. ప్రతీ గురువారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ సప్తగిరి టూర్ ప్యాకేజీ వివరాలు:

  • ఐఆర్‌సీటీసీ సప్తగిరి టూర్ మొదటి రోజు కరీంనగర్‌లో ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు 12762 నెంబర్ గల ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరాలి. ఈ రైలు రాత్రి 7.15 గంటలకు కరీంనగర్‌లో, రాత్రి 8.05 గంటలకు పెద్దపల్లిలో, రాత్రి 9.15 గంటలకు వరంగల్‌లో, రాత్రి 11 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. పర్యాటకులు రాత్రంతా జర్నీ చేయాల్సి ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 7.50 గంటలకు రైలు తిరుపతి చేరుకుంటుంది. ఐఆర్‌సీటీసీ సిబ్బంది పర్యాటకుల్ని రిసీవ్ చేసుకొని అక్కడ్నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. ప్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను సందర్శించాలి. ఆ తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి.
  • మూడో రోజు ఉదయం అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెకౌట్ కావాలి. ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనం పూర్తైన తర్వాత తిరుపతికి బయల్దేరాలి. రాత్రి 8.15 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో 12761 నెంబర్ గల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. ప్రయాణికులు తెల్లవారుజామున 03:26 ఖమ్మంలో, 04:41 గంటలకు వరంగల్‌లో, 05:55 గంటలకు పెద్దపల్లిలో, ఉదయం 08:40 గంటలకు కరీంనగర్‌లో దిగొచ్చు.

ఐఆర్‌సీటీసీ సప్తగిరి టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4970, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4990, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6290 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6890, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.8190 చెల్లించాలి. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాసులో ప్రయాణం, ఏసీ హోటల్‌లో వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్, ఇతర ఆలయాల్లో రెగ్యులర్ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.