టీఆర్‌ఎస్‌లో లీడర్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి నెలకొంది. బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా, మాజీ మంత్రుల మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో మంత్రిగా తనకు అవకాశం ఉంటుందని కడియం శ్రీహరి ఆశించారు. కాని సీఎం తన కమ్యూనిటీకి చెందిన ఎర్రబెల్లికి చాన్స్​ ఇచ్చారు. తనకు మంత్రి పదవి రాలేదని ఆవేదనలో కడియం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలోనే ఉన్న వినయ్ భాస్కర్ వర్గం కూడా అసంతృప్తిగా ఉన్నట్లు జిల్లాలో చర్చ నడుస్తోంది. ‘‘ఉద్యమం మేం చేస్తే.. పదవులు మాత్రం కొత్తగా వచ్చిన వారికి ఎట్లిస్తరు” అంటూ వినయ్ అనుచరులు నిలదీస్తున్నారు.

తొలి ప్రభుత్వంలో కడియం వల్ల మలి ప్రభుత్వంలో ఎర్రబెల్లి వల్ల తాజా విస్తరణలో సత్యవతి రాథోడ్ వల్ల వినయ్​కు మంత్రి పదవి దక్కలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక కడియంకు, కొత్త మంత్రి సత్యవతి రాథోడ్​కు మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో టీడీపీలో కడియం, సత్యవతి కలిసి పనిచేశారు. సత్యవతి మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే గతంలో కడియం పేషీలో పనిచేసిన సిబ్బందిని తన పేషీలో నియమించుకున్నారు. రెడ్యానాయక్ తనకంటే జూనియర్​ అయిన సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి ఇవ్వడంపై గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని మూడురోజుల క్రితం కేటీఆర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పదవులపై మరో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ కూడా స్పందించారు. జిల్లా నుంచి పదవి ఇస్తే సీనియర్​గా తనకే ఇవ్వాలని, నిన్నగాక మొన్నవచ్చినవాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటని ఆయన మీడియా చిట్​చాట్​లో అన్నారు…