పండుగ పూట సరదాగా గడుపుదామని బయలుదేరిన కుటుంబంలో విషాదం నెలకొంది. ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహ్మద్‌గౌస్‌పల్లి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు వారి నాలుగు నెలల కుమారుడు కూడా మృతి చెందడంతో విషాదం నెలకొంది. వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన బానోత్‌ సోనల్‌(33), రజిత (28) లు, వారి నాలుగు నెలల బాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

ఎర్రబెల్లి గ్రామానికి చెందిన జగన్‌-సుగుణ దంపతుల కుమారుడు సోనల్‌కు అదే గ్రామానికి చెందిన భజన్‌లాల్‌-రాజమ్మ దంపతుల కూతురు రజితతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి అఖిల అనే నాలుగు సంవత్సరాల పాపతో పాటు నాలుగు నెలల బాబు ఉన్నాడు.

సోనల్‌ ఏటూరునాగారంలోని DMHO కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పండుగ పూట తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి గడపాలని శుక్రవారం ఏటూరునాగారం నుంచి సోనల్‌ బయలుదేరారు. బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు కోసం వేచి చూస్తుండగా ఎర్టీకో కారు డ్రైవర్‌ హన్మకొండకు కారు వెళ్తుందని వస్తారా అని అడిగారు. దీంతో సోనల్‌ ఆయన భార్య రజిత, నాలుగు నెలల చిన్నబాబుతో కారులో బయలుదేరారు. కారులో మొత్తం ఏడుగురు ఉన్నారు.

కారు వేగంగా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహ్మద్‌గౌస్‌పల్లి గ్రామం వద్ద మరో వాహనాన్ని కారు ఢీ కొనడంతో సంఘటన స్థలంలోనే సోనల్‌, రజిత, వారి నాలుగు నెలల బాబు మృతి చెందారు. రజిత పొత్తిల్లలోనే నాలుగు నెలల బాబు చనిపోయి ఉండడంతో పలువురిని కంటతడి పెట్టింది. వీరి కూతురు నానమ్మ, తాతయ్యల వద్ద ఉంటుంది.

పండుగ పూట ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోనల్‌, రజితలది ఇద్దరిది ఎర్రబెల్లి గ్రామం కావడం ఒకేసారి భార్యభర్తలతోపాటు వారి నాలు గు నెలల కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇరు కుటుంబాల రోదనలు మిన్నంటాయి.