మరిపెడ ఎమ్మార్వో ఆఫీస్ లో కలకలం రేగింది. ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో ఆఫీస్ కి వచ్చి హల్ చల్ చేశాడు. పట్టా పాసు పుస్తకం ఇవ్వడంలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెట్రోల్ బాటిల్ తీసుకుని రావడంతో కార్యాలయంలో కాసేపు కలకలం రేగింది. సిబ్బందితో ఆ రైతు వాగ్వాదానికి దిగాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. కాగా, సిబ్బంది అతడికి నచ్చచెప్పారు.

రైతు పేరు అశోక్ చిల్లంచెల్ల గ్రామవాసి తనకి తాతల నుంచి వారసత్వంగా 5 ఎకరాల సాగు భూమి ఉందన్నాడు. అయితే రెండున్నర ఎకరాల భూమికి మాత్రమే పట్టా పాసు పుస్తకం ఇచ్చారని, మిగిలిన భూమిలో తిరకాసు పెట్టారని అశోక్ వాపోయాడు. ఇందులో కొంత ప్రభుత్వభూమి ఉందని అధికారులు కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

నెలలు తరబడి ఆఫీస్ చుట్టు తిప్పుకున్నారని, అయినా పని జరగడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను సహనం కోల్పోయానని, అందుకే ఇలా పెట్రోల్ బాటిల్ తో వచ్చానని వివరించాడు. ఆ భూమే తన కటుంబానికి ఆధారం అని అశోక్ స్పష్టం చేశాడు.