మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వారిని ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్య సేవలు ప్రారంభించారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. మంత్రి సత్యవతిరాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంక, వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు. మహబూబాబాద్లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల (6, 7, 8, 9, 10, ఇంటర్ ప్రథమ, ద్వితీయ)లో 378 మంది విద్యార్థులు ఉండగా, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు కాగానే వారి స్వగృహాలకు వెళ్లిపోయారు. పదో తరగతి చదువుతున్న 66 మంది విద్యార్థులు రెడ్యాల ఆశ్రమ గురుకుల పాఠశాలలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మిగతా 252 మంది విద్యార్థులు గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఉంటున్నారు. కాగా, కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులతో విద్యార్థులు, సెక్యూరిటీ గార్డ్ బాధపడుతున్నారని తెలుసుకున్న ఏఎన్ఎం వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ నెల 1న కొందరికి కరోనా ఆర్టీపీసీ టెస్టులు నిర్వహించగా, ఒక సెక్యూరిటీ గార్డు, మరో విద్యార్థికి పాజిటివ్ రావడంతో వారిని ఐసోలేషన్లో ఉంచి వైద్యసేవలు ప్రారంభించారు. ఆ తర్వాత మరికొంత మంది విద్యార్థులు ఇదే రీతిన అనారోగ్యానికి గురికావడంతో 51 మందికి ఆర్టీపీసీ పరీక్షలు చేయించారు. వీరిలో 15 మందికి పాజిటివ్ రిపోర్టు 4వ తేదీన వచ్చింది. వీరందరినీ గురుకులంలోనే ఓ గది (ఐసోలేషన్)లో ఉంచి పౌష్టికాహారం, మందులు ఇవ్వడం ప్రారంభించారు. గురుకుల నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. దీంతో వారు గురుకులానికి చేరుకుని పిల్లలను తీసుకువెళ్తామని కోరడంతో బుధవారం 12 మంది విద్యార్థులకు 5రోజులకు సరిపడా మందులు, మాస్కులు ఇచ్చి పంపించారు. మిగిలిన ముగ్గురు గురుకులం ఐసోలేషన్లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుంచి 6వ తేదీ వరకు 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:

కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు సూచించారు. రద్దీగా ఉన్న ప్రదేశాలు, ఫంక్షన్సస్ కు వెళ్లినప్పుడు తప్ప నిసరిగా మాస్క్ ధరించాలని అన్నారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు జ్వరం లేదా జలుబు, దగ్గు ఉన్నట్లయితే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తరుచుగా చేతులను సబ్బుతో శుభ్రపర్చు కోవాలని DMHO తెలిపారు.