హన్మకొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు పొడిగించినట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే ఆ పాఠశాలలపై చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేస్తామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రత్యేక తరగతుల పేరిట క్లాసులు నిర్వహిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని విద్యాసంస్థలు ఇప్పుడు ప్రకటించిన సెలవులకు బదులుగా ఏప్రిల్‌ 2020 వరకు రెండో శనివారాలలో పని చేయాలని పేర్కొన్నారు.

సేలవులోద్దు… బడులు తేరవండి:

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించడాన్ని పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ తప్పుబడుతున్నారు. దసరా సెలవులను ఈ నెల 20 వరకు పొడిగింపును వివిధ సంఘాల నేతలు విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సెలవులు పొడగించడమేంటని నిలదీస్తున్నారు. స్కూళ్లకు దసరా సెలవులను పొడిగించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) పేర్కొంది. ప్రభుత్వం పట్టుదలతో విద్యార్థులు నష్టపోతున్నారని కమిటీ నేతలు మండిపడ్డారు.

సెలవులను పెంచడం ద్వారా సమ్మె ప్రభావం తీవ్రంగా ఉందని ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనని టీచర్స్​ జాక్టో ఆరోపించింది. పిల్లలను విద్యకు దూరంచేయడం విద్యాహక్కు ఉల్లంఘనేనని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్చుతరావు విమర్శించారు….