రివైజింగ్ కమిటీని ఆశ్రయించిన వర్మ

రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్‌కు తీపికబురు చెప్పింది రివైజింగ్ కమిటీ. ఈయన తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ కూడా సినిమాను చూసి సర్టిఫికేట్ ఇవ్వలేమని చేతులెత్తేయడంతో ఈయన రివైజింగ్ కమిటీని ఆశ్రయించాడు. ఇప్పుడు వర్మ మొరను వాళ్లు ఆలకించారు. దాంతో ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ రివైజింగ్ కమిటీ తీర్మానం చేసింది.

కొన్ని కట్స్ ఇచ్చి ఈ సినిమాను విడుదల చేసుకోండి అంటూ వర్మకు ఊరటనిచ్చింది రివైజింగ్ కమిటీ. ఈ సినిమాకు కమ్మరాజ్యంలో అని కాకుండా టైటిల్ మార్చేసాడు దర్శకుడు వర్మ. దీనికి అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ మార్చేసాడు ఆర్జీవీ. కొత్త టైటిల్ ప్రకటించినా కూడా అంతా కమ్మరాజ్యంలో అంటూనే ఫ్యాన్స్ వాడేస్తున్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేసుకోమ్మని వర్మకు చెప్పడంతో అభిమానులు కూడా ఆసక్తిగా సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నాడు వర్మ.