మండలంలోని అనంతరాయుడుపేట గ్రామానికి చెందిన యువతి తనకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబసభ్యులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగింది. వివరాలిలా ఉన్నాయి: గ్రామానికి చెందిన డిగ్రీ చదివిన యువతి మక్కువ మండలం, సీబిల్లిపెద్దవలస గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. సీబిల్లి పెద్దవలసలో తాతగారి ఇంటిదగ్గర ఉన్నసమయంలో యువకుడితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారడంతో గర్భం దాల్చింది. ఆ యువతికి ప్రస్తుతం ఐదో నెల రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా విషయం చెప్పింది. దీంతో బాధిత యువతతితో పాటు తల్లిదండ్రులు మక్కువ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు స్పందించి యవతి గర్భం దాల్చడానికి కారణమైన అబ్బాయిని, తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. యువతికి న్యాయం చేస్తామని, ఆ అబ్బాయితోనే పెళ్లి చేస్తామని పోలీసులు తొలుత చెప్పి తరువాత మాట మార్చారని బాధితులు వాపోయారు.

దీంతో గురువారం సాయంత్రం సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు నమోదు చేసిన ఎస్సై కె.నీలకంఠం ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. న్యాయం చేయమని కోరితే కేసు నమోదు చేశామని, పోలీసులు చెప్పడంతో జీర్ణించుకోలేక పోయిన బాధిత కుటుంబం గంటపాటు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. న్యాయం చేస్తామని చేస్తామని చెప్పిన సాలూరు సీఐ కొద్దివ్యవధిలోనే మాటమార్చి అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై నీలకంఠంతోపాటు మహిళా పోలీసులు ఎంతో నచ్చజెప్పినా ఫలితంలేక పోయింది. సమాచారం తెలుసుకున్న పార్వతీపురం డీఎస్పీ సుభాష్‌ సీతానగరం పోలీస్టేషన్‌కు వచ్చి బాధితురాలితోపాటు తండ్రితో చర్చించి న్యాయం చేస్తామని, మోసం చేసిన వ్యక్తిని మక్కువ పోలీస్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దీంతో బాధితులు నిరసన విరమించారు.