వేములవాడ: వేములవాడలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని, కొందరు అడ్డగోలుగా భూములు, గుట్టలు కబ్జాలు చేసుకున్నారని, ఆ విషయాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అయిన రమేశ్‌బాబు వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో సొంతపార్టీ నేతలున్నా వదలబోనని హెచ్చరించడంపై స్థానికంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. వేములవాడలో ఈ నెల 5న జరిగిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు తుపాకీ, మైనింగ్‌ లైసెన్సులు తీసుకొని రాజ్యమేలాలని చూస్తున్నారని రమేశ్‌ వ్యాఖ్యానించడంతో స్థానికంగా దుమారం చెలరేగుతోంది.

వేములవాడ పట్టణ శివారులోని అగ్రహారం గుట్టలు, నందికమాన్‌ ప్రాంతంలో భూములను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా భుజాలు తడుముకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అధికార పార్టీ నాయకులు మైనింగ్‌ వ్యాపారంలో ఉన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు. వేములవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నవారికి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దడ పుట్టిస్తున్నాయి.