కోపం వస్తే ఎవరినైనా ఒరే దున్నపోతూ అని తిట్టకండి ఎందుకంటే దున్నపోతుల్లోనూ రాజ కళ ఉంటుంది వాటికి రాజ వైభవం కలుగుతుంది ఫైవ్ స్టార్ లైఫ్ స్టైల్ ఉంటుంది హరియాణాలోని సోనిపత్‌ జిల్లా సైనిపురాకు చెందిన దున్న పేరు సర్తాజ్‌. వయసు నాలుగున్నరేళ్లు. రెండునెలల వయసున్నప్పుడు వీరేందర్‌ దీన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం 1600 కేజీల బరువూ ఆరడుగుల ఎత్తూ, పదిహేడు అడుగుల పొడవుంది. ఐదేళ్లు నిండేవరకూ దీని బరువూ, ఎత్తూ పెరుగుతూనే ఉంటాయి. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే భారీ క్రేన్లూ, ట్రాలీలూ అవసరమవుతాయి.

ఎప్పుడూ దీని సేవలో ఇద్దరు సహాయకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. వీళ్లు సర్తాజ్‌ను ప్రతిరోజూ ఉదయం ఐదు కిలోమీటర్లు వాకింగుకు తీసుకెళతారు. వాకింగు పూర్తయ్యాక ఆవ, వేప, బాదం, నువ్వుల నూనెలతో అరగంటపాటు మర్దన చేసి వేణ్నీళ్లతో స్నానం చేయిస్తారు. అలానే సాయంత్రం కూడా మసాజ్‌, స్నానాలు ఉంటాయి. రోజుకి కేజీ చొప్పున బాదం, జీడిపప్పూ, కందిపప్పూ, సెనగపప్పూ, చిరుధాన్యాల దాణా తింటుంది సర్తాజ్‌. ఒక్కపూటకి పాతిక యాపిల్స్‌, రెండు డజన్ల అరటిపండ్లు లాగించేస్తుంది. దీనికి పాలంటే ఎంతిష్టమో. పది లీటర్ల చిక్కటి పాలు గటగటా తాగేస్తుంది. రెండు కేజీల బెల్లం ఇట్టే నమిలి మింగేస్తుంది. ఇది ఎండకి ఎక్కువ సేపు తట్టుకోలేదు.

వేసవిలో ఏసీ ఫ్యానూ తప్పనిసరట. వీరేందర్‌ దీని నిర్వహణకోసం రోజుకు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఇది పేరుకే దున్నపోతుగానీ రాజవైభవం అనుభవిస్తోంది కదూ ! కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ‘సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ బఫెలోస్‌’ (సీఐఆర్‌బీ) దేశవ్యాప్తంగా నిర్వహించే పశుమేళాల్లో పాతికసార్లు నంబర్‌వన్‌గా నిలిచిందీ దున్నపోతు. బరువూ, ఎత్తూ, రూపాన్ని బట్టి ర్యాంకింగును నిర్ణయిస్తుంది సీఐఆర్‌బీ.

అంతేకాదు, సర్తాజ్‌ వీర్యం ద్వారా జన్మించిన గేదెలు సైతం దాదాపు ఇరవై లీటర్లకుపైగా పాలిస్తున్నట్లు సర్టిఫై చేసింది ఆ సంస్థ. దీన్ని 27 కోట్లరూపాయలకు కొనుగోలు చేస్తామని విదేశీ సంస్థలు ముందుకొచ్చాయి అయినా వీరేందర్ దీన్ని అమ్మకానికి ఒప్పుకోలేదు వీర్యం ద్వారా ఏడాదికి కోట్లు తెచ్చిపెడుతున్న సర్తాజ్‌ను వీరేందర్‌ అలా ఎలా వదులుకుంటాడు. సర్తాజ్‌ వీర్యాన్ని 100ఎమ్‌.ఎల్‌ మూడొందల నుంచీ ఐదొందల వరకూ అమ్ముతున్నాడు. వారంలో రెండుసార్లు వీర్యాన్ని తీసి ప్రత్యేకంగా భద్రపరుస్తున్నాడు…