కాజీపేట చైతన్యపురి కాలనీ నిట్‌ ప్రధాన రోడ్డు పక్కన ఉన్న HDFC ఏటీఎం దగ్ధమైన ఘటనలో సుమారు రూ.5 లక్షల వరకు దహనమైనట్లు ఆ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై HDFC బ్యాంకు మేనేజరు డి.నాగరాజు కాజీపేట పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనను చూసిన వాహనదారులు 100 డయల్‌కు కాల్‌ చేయడంలో పోలీసులు సకాలంలో స్పందించినా ప్రయోజనం లేకుండా పోయింది. వరంగల్‌ నిట్‌ వద్ద ఉన్న సబ్‌స్టేషన్‌కు వెళ్లి విద్యుత్తు సిబ్బందిని సరఫరా నిలిపివేయమని కోరిన పోలీసులకు అతని నుంచి సహకారం అందలేదు.

మత్తులో నిద్రించిన అతను తాళాలు తన వద్ద లేవని చెప్పడంతో ట్రాఫిక్‌, శాంతిభద్రతల పోలీసులు స్థానికులతో కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక వాహనం వచ్చి పూర్తి మంటలను తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఉండి ఆర్పేశారు. ఏసీలో విద్యుదాఘాతం ఏర్పడి మంటలు లేచినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఉన్న కాపలాదారులను తీసి వేసిన బ్యాంకు అధికారులు వాటి నిర్వహణ, పర్యవేక్షణ చేయడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. గతంలో ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు అయిపోతే ఒక  రోజులో పెట్టి ఖాతాదారులకు అందుబాటులో ఉంచేవారు. ఏసీలు, ఏటీఎంల నెట్‌వర్క్‌ పనిచేయకపోతే సంబంధిత కాంట్రాక్టు యజమాని, బ్యాంకు అధికారులు స్పందించి సరిజేసేవారు. ప్రస్తుతం ఏటీఎంల పరిస్థితి గాలిలో దీపంలా మారింది.