చందానగర్‌: భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య, ఇద్దరు పిల్లలను అత్యంత పాశవికంగా చంపిన భర్త ఆపై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందానగర్‌ సీఐ క్యాస్ట్రో కథనం ప్రకారం: సంగారెడ్డి జిల్లా కోహీర్‌కు చెందిన రామలింగస్వామి, శకుంతలమ్మ దంపతుల చిన్న కుమారుడు మడపతి నాగరాజు (42)కు మెదక్‌ జిల్లా పోల్కంపల్లికి చెందిన సుజాత (36)తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి సిద్ధార్థ్‌ (10), రమ్యశ్రీ (8) పిల్లలు ఉన్నా రు. నాగరాజు కుటుంబం కొంతకాలం కిందట నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో ఉన్న రా జీవ్‌ గృహకల్పలో నివాసం ఉంటోంది. నాగరాజు కిరాణా షాపులకు మాసాలాలు, ఇతర గృహావసర వస్తువులను సరఫరా చేస్తుండేవాడు. సుజాత ఇంటి దగ్గర టైలరింగ్‌ చేస్తూ వడ్డీకి డబ్బులు ఇచ్చేది. గత కొన్నాళ్లుగా సుజాతపై అనుమానం పెంచుకున్న నాగరాజు ఆమెతో గొడవపడేవాడు. అతను కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో శుక్రవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో భార్యా, పిల్లలను చంపాలనుకున్న నాగరాజు ముందుగా వారికి విషమిచ్చి ఉంటాడని అయినా వారు బతికి ఉండొచ్చన్న అనుమానంతో ఇంట్లో ఉన్న టైలరింగ్‌ కత్తెరతో భార్యను తల, మెడపై పొడవగా కుమారుడు సిద్ధార్థ్‌ను కడుపులో, కూతురు రమ్యశ్రీని వీపు వెనుక భాగంలో పొడిచాడని పోలీసులు భావిస్తున్నారు. అనంత రం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు కిటికీలోంచి చూడగా ఇద్దరు పిల్లలు రక్తపుమడుగులో నిర్జీ వంగా కనిపించారు. దీంతో వారు వెంటనే చందానగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సుజాత తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నాగరాజు సైకోగా మారి హత్యలు చేశాడా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిని మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్‌ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ క్యాస్ట్రో పరిశీలించారు.