కారేపల్లికి చెందిన వేణు, ఎర్రబోడు గ్రామానికి చెందిన సునీతలు ప్రేమించుకున్నారు. 2021 అక్టోబరులో గ్రామ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు హైదరాబాద్ లో కాపురం పెట్టారు. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు అని ఎన్నో ఊహలు పెట్టుకుంది సునీత. కానీ ఆ కలలు అన్ని కల్లలు గా మిగలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. చిరు ఉద్యోగం చేస్తున్న ప్రేమ జంటను ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టాయి. నెలసరి జీతం ఖర్చులకు సరిపోకపోవడంతో 2022లో ఖమ్మం వచ్చింది ఈ ప్రేమ జంట. ఇక్కడి నుంచే అసలైన కథ మెుదలైంది. ఊహించని సంఘటనల నడుమ తనకు న్యాయం చెయ్యాలని స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని దీక్ష చేస్తోంది సునీత. ఆమెను అలా చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి అంటున్నారు స్థానికులు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఖమ్మం వచ్చారు వేణు, సునీతలు.

ఈ క్రమంలోనే ఏదైన మంచి ఉద్యోగం చూసుకుని వస్తానని చెప్పి సునీతను హస్టల్ లో చేర్పించి వెళ్లాడు వేణు. రోజులు గడుస్తున్నా గానీ వేణు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఎనిమిది నెలల క్రితం కారేపల్లి వచ్చింది సునీత. అత్తింటి వారు లోపలికి రానివ్వకపోవడంతో కొన్ని రోజులు భర్త ఇంటి ముందే ధర్నాకు దిగింది. అయితే అత్త ఇల్లు వదిలి పెట్టి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆ ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది సునీత. ఈ క్రమంలోనే తన భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది.

భర్తనే తలచుకుంటూ ఒంటరిగా నరకం అనుభవిస్తున్న సునీతపై కొద్దిగా కూడా జాలి చూపించని అత్త ఊరు నుంచి రాగానే ఇంట్లో నుంచి గెంటేసింది. నిస్సహాయ స్థితిలో రోడ్డు మీద పడ్డ సునీత గురువారం స్థానిక ప్రధాన కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్ కళ్లకు కట్టుకుని దీక్షకు దిగింది. ఈ క్రమంలోనే తనను రూ.లక్షల్లో కట్నం తీసుకు రమ్మంటున్నారని, అందుకే నా భర్త ఆచూకి చెప్పకుండా భయపెడుతున్నారని కన్నీరు మున్నీరైంది సునీత. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటు బతుకుతున్నా గానీ తనను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది సునీత. విషయం తెలుసుకున్న ఎస్సై రామారావు రాత్రి 9 గంటల సమయంలో సునీత దగ్గరకు వచ్చాడు. ఆమె భర్తను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచేలా చర్యలు తీసుకుంటానని సునీతకు హామీ ఇచ్చాడు. అనంతరం భర్త ఇంట్లోకి వెళ్లేందుకు సునీత ప్రయత్నించగా కుటుంబ సభ్యులు మళ్లీ అడ్డుకున్నారు. దాంతో దిక్కుతోచని స్థితిలోకి చేరుకుంది సునీత. ఆమె దుస్థితిని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు స్థానికులు.