హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా లిక్కర్‌ కేసు రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్స్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో, మరోసారి రాష్ట్రంలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా, లిక్కర్‌ స్కామ్‌లో కవిత పేరు చేర్చడంతో తెలంగాణ బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై సంచలన కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్సే ఈటల రాజేందర్‌ స్పందించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ: ‘లిక్కర్‌ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుంది. స్కాంలో ఉన్న వారికి శిక్ష తప్పదు. ఇక్కడ దోపిడీ చాలదన్నట్టు ఢిల్లీకి వెళ్లి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలను కొనే సంస్కృతికి తెర తీసింది కేసీఆరే’ అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక, కవిత అంశంపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు.

తాజాగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ: ‘తప్పులు బయటపడతాయనే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారు. సానుభూతి పొందేందుకు కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తోంది. తప్పు చేయకపోతే ఈడీ, సీబీఐ అంటే భయమెందుకు?. కవిత జైలుకు వెళ్తే అవినీతి వల్లే పోతుంది. ప్రజల కోసమే జైలుకు వెళ్తానని మాట్లాడటం విడ్దూరంగా ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు లిక్కర్‌ స్కాంలో తన పేరు చేర్చడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ, ప్రధాని మోదీపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఎనిమిదేళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయని, అందుకే మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు.

తనతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. తమపై కేసులు పెట్టడం నీచమైన రాజకీయ ఎత్తుగడ అని విమర్శించారు. సీబీఐ, ఈడీతో భయపెట్టించి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కేసులు పెడతామంటే పెట్టుకోండి అరెస్టులు చేసుకోండి దేనికైనా భయపడేది లేదు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటాం. జైళ్లో పెడతామంటే పెట్టుకోండి అంతకంటే ఏం చేయగలరు? అని కవిత ఫైర్‌ అయ్యారు.