పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు కలిగినా తరచుగా శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. చివరకు పేగు తెంచుకుని పుట్టిన సొంత బిడ్డలను సైతం దూరం చేయడంతో మానసికంగా కృంగిపోయిన ఆ తల్లి తీవ్ర మనోవేదనకు గురై పిల్లలే నాకు దూరమైతే నేనెందుకు బతకాలి, ఇంకెందుకు నా బతుకంటూ పుట్టింట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌న గర్‌లో జరిగింది. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం సూసైడ్‌ నోటు ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు తమ బిడ్డ మృతదేహంతో సంజయ్‌నగర్‌ బస్తీలోని భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, అంతమ్మ గూడంనకు చెందిన శ్రీలత(30)కు పదేళ్ల క్రితం బాగ్‌లింగంపల్లికి చెందిన సాగర్‌తో వివాహమైంది. వీరికి చెర్రి (7), హని (6) ఇద్దరు సంతానం.

డీజే సౌండ్‌ సిస్టమ్‌ను నడుపుకునే సాగర్, అతని తమ్ముడు గడ్డం సతీష్‌ ఓ రాజకీయ పారీ్టలో పనిచేస్తున్నారు. వారి తల్లి భాగ్యలక్ష్మి రైల్వేలో ఉద్యోగి. గత కొన్నిరోజులుగా సాగర్‌ మద్యం సేవించి భార్య శ్రీలతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు తెలిసింది. కాగా అదనపు కట్నం తీసుకురావాలంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా అమ్మకు దయ్యం పట్టిందంటూ ఇద్దరు పిల్లలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలత పుట్టింటికి వెళ్లగా పిల్లలను తనవద్దే ఉంచుకుంటానని చెప్పి భార్యకు విడాకులు ఇస్తున్నట్లుగా ఓ అడ్వొకేట్‌ ద్వారా సాగర్‌ భార్యకు నోటీసులు పంపినట్లు సమాచారం. పిల్లలే దూరమైతే నేనెందుకు బతకాలి, నాబతుకెందుకు అంటూ ఆమె పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.