హైదరాబాద్ లో దారుణం ! బతికేవున్న బిడ్డను పూడ్చిపెట్టే ప్రయత్నం:

హైదరాబాద్ లో ఓ దారుణం వెలుగుచూసింది. నగరం నడిబొడ్డులో జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ఆడ పురిటి బిడ్డను బతికి వుండగానే పూడ్చి పెట్టే ప్రయత్నాన్ని సకాలంలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ అడ్డుకున్నాడు. బస్టాండ్ సమీపంలోనే చేతిలో ఓ ప్లాస్టిక్ బ్యాగు పట్టుకుని ఓ వ్యక్తి గుంట తవ్వుతున్నాడు. బ్యాగులో బిడ్డ కదులుతుండడంతో ఆటో డ్రైవర్ కు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు.

వెంటనే అక్కడికి చేసుకున్న పోలీసులు ఆరా తీయడంతో చనిపోయిన తమ మనవరాలిని పూడ్చి పెడుతున్నామని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగును పరిశీలించగా బ్యాగులో బతికి వున్న శిశువు కనిపించింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని జైలుకి తరలించారు. ఆడ బిడ్డ పుట్టిందన్న కారణంగానే ఆ బిడ్డను పూడ్చి పెట్టేందుకు తీసుకొచ్చారని పోలీసులు నిర్ధారించారు. ఆ శిశువును చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.