మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్‌ హబ్సిగూడ ప్రధాన రహదారిలో బీభత్సం సృష్టించారు. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను, ఓ స్కూటీని ఢీకొట్టిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌ నాయక్‌ తెలిపిన వివరాల మేరకు: హబ్సిగూడలో ఫుడ్‌ పాయింట్‌ నిర్వహిస్తున్న మౌర్య తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పూటుగా మద్యం తాగారు. ఉదయం ఒక్కడే మౌర్య 8 గంటలకు హబ్సిగూడ స్ట్రీట్‌ నంబర్‌–8 నుంచి సికింద్రాబాద్‌కు కారులో బయలుదేరారు.

కొద్దిసేపటికే మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ తన కారుతో రామంతాపూర్‌ వైపు వెళ్తున్న ఓ ఆటోను, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆటో, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు హరీష్, శ్రీనివాస్, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ మల్లికార్జున్‌ పరిస్థితి విషమంగా ఉందన్నారు. కారు డ్రైవర్‌ మౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉందని ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ నాయక్‌ తెలిపారు.