దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని సామాజిక మాధ్యమంతో ప్రశ్నిస్తే తన అనుచరుడితో తెలంగాణ వికలాంగుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర మాజీ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి అక్రమంగా సైబర్‌ కేసు పెట్టించారని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ పల్లకొండ కుమారస్వామి ఆరోపించారు. బాలసముద్రంలోని వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాసుదేవరెడ్డి ఛైర్మన్‌గా పదవీకాలంలో దివ్యాంగుల వసతిగృహాలను అభివృద్ధి చేయలేదన్నారు. ట్రైసెకిళ్ల మంజూరు విషయంలో అర్హత కలిగిన వారికి అన్యాయం చేశారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలకు వికలాంగుల అభివృద్ధి సంస్థ ఛైర్మగా నియమించాలన్నారు.

ఈ అంశంపై మాజీ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డిని విలేకరి ఫోన్‌లో వివరణ కోరగా । కొంతమంది పలు జిల్లాల ఇతర పార్టీలకు చెందిన దివ్యాంగులు ఉద్దేశపూర్వకంగా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సామాజిక మాధ్యమంతో తనపై అసభ్య పదజాలంతో దుష్ప్రచారం చేయగా, దీనిని విభేదించిన ఓ వ్యక్తి సైబరాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఇందులో తన ప్రమేయం లేదన్నారు. ఛైర్మన్‌ పదవీకాలంలో వికలాంగుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశానన్నారు.