ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు ఆ దేశాన్ని అతలాకుతులం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల ప్రచారంలో భాగంగా ఆస్ట్రేలియాలోని 10వేల ఒంటెలను చంపాలని నిర్ణయించుకున్నారు. బుధవారం నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం కార్చిచ్చుతో పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో వేడిని భరించలేక ఒంటెలు ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నాయి. అందుకే వాటిని చంపేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొనడం గమనార్హం.

ఈ మేరకు 10వేల ఒంటెలను చంపడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా తుపాకులతో నైపుణ్యం కలిగిన వ్యక్తులు కాల్చివేయనున్నారు. ఒంటెలను కాల్చివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా కార్చిచ్చులో ఇప్పటికే అర బిలియన్‌ జంతువులు చనిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఒంటెలను కాల్చివేయడం సరికాదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవులు అత్యంత ప్రమాదకరంగా మారారు అని మరో నెటిజన్‌ స్పందించారు. ఆస్ట్రేలియాలో ఒంటెల జనాభా 1.2 మిలియన్లు.

నివాస ప్రాంతాల్లోకి వస్తున్న ఒంటెలను మాత్రమే:

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒంటెలను చీడపురుగులుగా పరిగణిస్తోంది. కరువు నెలకొన్న దృష్ట్యా అవి ఆహారం, నీరు కోసం సుదూర ప్రాంతాలకు సంచరిస్తున్నాయని ఈ క్రమంలోనే మొక్కలను, నీటి వనరులను నాశనం చేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఒంటెలను మాత్రమే చంపేస్తున్నామని ఆ తర్వాత వాటి కళేబరాలను వేరే చోట కాల్చివేస్తున్నట్టు ఆస్ట్రేలియా పబ్లిక్‌ బ్రాడ్‌క్యాస్టర్‌ ఏబీసీ కథనాన్ని ప్రసారం చేసింది…