కరోనా పేరు చెబితే కుర్రాళ్లు సైతం వణికిపోయే పరిస్థితి. కానీ 105 ఏళ్ల వయస్సులోనూ ఓ బామ్మ, మహమ్మారిని విజయవంతంగా తిప్పికొట్టారు. కర్నూలు పాతబస్తీలోని పెద్దపడఖానావీధికి చెందిన బి.మోహనమ్మ వయస్సు 105 ఏళ్లు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు 82 ఏళ్లు, రెండో కుమార్తెకు 80 ఏళ్లు, మూడో కుమార్తెకు 70 ఏళ్ల వయస్సు.. కరోనా నిర్ధారణ అయిన సమయంలోనూ ఆమెకు స్వల్ప జ్వరం మినహా ఇతరత్రా లక్షణాలు లేవు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కొద్దిగా ఆయాసం రావడంతో ఆక్సిజన్‌ ఏర్పాటు చేశారు. అంతకు మించి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఎదుర్కోకుండానే కోలుకున్నారు.

గతంలో నేనెప్పుడూ ఇలాంటి రోగాన్ని చూడలేదు. అప్పుడెప్పుడో ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చిందని బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. నాకు బీపీ, షుగర్‌ ఉన్నా నియంత్రణలో ఉంటాయి. ఆరోగ్యకర అలవాట్ల వల్లే నేను కరోనాను జయించగలిగా. ఇప్పటికీ యోగా, ధ్యానం చేస్తుంటా. అవే నా ఆరోగ్య రహస్యాలు అంటుంది మోహనమ్మ .. ఆమె జీవితంలో ఎనిమిది మంది సంతానంతో పాటు 26 మంది మనవళ్లు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలను కూడా చూశారు.