16ఏళ్లకే ముస్లిం అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్- హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఓ తీర్పులో తెలిపింది. జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఓ కేసులో ఈ తీర్పును వెలువరించింది. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ కు చెందిన 16ఏళ్ల అమ్మాయి, 21ఏళ్ల అబ్బాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకొని కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న కుటంబసభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో జూన్ 8వ తేదీన వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తాము పెళ్లి చేసుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు తమపై అఘాయిత్యానికి పాల్పడే అవకాశముందని, వారి నుంచి రక్షణ కావాలని దంపతులు పంజాబ్ కోర్టును వేడుకున్నారు. ఈ కేసులో కోర్టు ఇవాళ తీర్పునిస్తూ 16ఏళ్లు నిండిన ముస్లిం మహిళ తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోవచ్చు అని పేర్కొన్నది. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని వాళ్ల ప్రాథమిక హక్కుల్ని కాలరాయలేమని జస్టిస్ జస్జిత్ తన తీర్పులో తెలిపారు. ఇస్లామిక్ షరియా చట్టాన్ని తన తీర్పులో ప్రస్తావించిన జస్టిస్ బేడీ ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లు ముస్లిం పర్సనల్ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. సర్ దిన్షా ఫర్దునిజి ముల్లా రాసిన మొహమ్మదీయ సూత్రాల్లో ఆర్టికల్ 195ప్రకారం ముస్లిం అమ్మాయికి 16ఏళ్లు నిండాయని, ఆ రూల్ ప్రకారం ఆమె పెళ్లి చేసుకోవచ్చు అని, అబ్బాయి వయసు 21ఏళ్లు దాటాయని ముస్లిం పర్సనల్ లా కూడా దీన్ని అంగీకరిస్తుందని జడ్జి జస్జిత్ సింగ్ బేడీ తెలిపారు. పిటిషనర్ల ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నందున కళ్ళు మూసుకోలేము అని కోర్టు పేర్కొంది. దంపతులకు సరైన భద్రత కల్పించాలని మరియు చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని పఠాన్‌కోట్‌ను SSPని కోర్టు ఆదేశించింది.
మరోవైపు, ఆదివారం జార్ఖండ్ రాష్ట్రంలో అపూర్వ వివాహం జరిగింది. ఒకే కళ్యాణమండపంలో ఇద్దరమ్మాయిల మెడలో తాళిబొట్టు కట్టాడు ఓ వరుడు. ఇద్దరమ్మాయిలను ప్రేమించిన యువకుడు ఇద్దరి మెడలో ఒకేసారి తాళిబొట్టు కట్టాడు. జార్ఖండ్‌లోని లోహర్దగాలో జరిగిన ఈ పెళ్లి కార్యక్రమం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యులే కాకుండా గ్రామ ప్రజలంతా తరలివచ్చి ఈ దంపతులను ఆశీర్వదించారు. లోహర్దగా జిల్లాలోని బండా గ్రామంలో సందీప్ ఒరాన్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ధనముంజి గ్రామంలో నివసించే కుసుమ్ లక్రా అనే యువతితో సందీప్ మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. అయితే పెళ్లికి ముందే సందీప్ బిడ్డకు కుసుమ్ లక్రా తల్లి అయింది. ఇదిలా ఉండగా, ఏడాది క్రితం బెంగాల్‌లోని ఓ ఇటుక బట్టీలో కలిసి పనిచేస్తుండగా స్వాతి అనే యువతితో సందీప్ కు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఈ పరిచయం కాస్తా ప్రేమగా చిగురించింది. కొద్ది నెలలుగా ఇద్దరు యువతులతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు సందీప్. ఇద్దరు యువతులతో ప్రేమ వ్యవహారం నడుస్తుండడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే బండా గ్రామంలో గ్రామస్తులు సమావేశం నిర్వహించి ఈ ఇద్దరు అమ్మాయిలకు సందీప్ తో వివాహం జరిపించాలని నిర్ణయించారు. కుటుంబసభ్యులు, సమాజం అంగీకారంతో ఈ అమ్మాయిలిద్దరికీ ఆదివారం సందీప్‌తో వివాహం జరిగింది.