వరంగల్‌ల్లో అదృశ్యమై పాతబస్తీకి చేరిన యువతిని పోలీసులు క్షేమంగా వెతికిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం: వరంగల్ రూరల్ జిల్లా, నర్సంపేటలోని లేబర్‌కాలనీకి చెందిన మహ్మద్ జావీద్ కూతురు మదిహా ఫాతిమా (19) ఈనెల 28 ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలించారు. అయినా ఆమె జాడ తెలియలేదు. చివరకు హైదరాబాద్ పాతబస్తీలోని తమ బంధువుల ఇంటికి వెళ్లొచ్చన్న అనుమానంతో ఈనెల 29న చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్సై వెంకటేష్, మహిళా కానిస్టేబుళ్ళ సహాయంతో జావీద్ బంధువులు నివసించే ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలోని జహనుమాలో గల వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ మదిహా ఫాతిమా కనిపించింది. దీంతో ఆమెను క్షేమంగా స్టేషన్‌కు తరలించారు. ఫాతిమా తండ్రి జావీద్ చూపిన ఆధారాలతో సంతృప్తి చెందిన పోలీసులు అతనికి కూతురును అప్పగించారు. అందుకు ఆయన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.