కన్నబిడ్డకు ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. కానీ బిడ్డ ఒకచోట, తల్లి మరోచోట. కరోనా కష్టకాలం వారిద్దర్నీ వేరు చేసింది. అయినా సరే బిడ్డపై ఆ తల్లికి ఉన్న ప్రేమ ఏకంగా 1800కిలోమీటర్ల దూరాన్ని స్కూటీపై ప్రయాణించేలా చేసింది. ఐదురోజుల అలుపెరగని ప్రయాణం తర్వాత కన్నబిడ్డను గుండెకు హత్తుకుంది ఆ తల్లి. ఆమె పేరు సోనియా దాస్. స్వస్థలం జార్ఖండ్ లోని జంషెడ్ పూర్. పొట్టకూటికోసం ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసింది సోనియా. కరోనా వల్ల ఆమె ఉద్యోగం పోయింది, ఇంటి అద్దె కట్టుకునే మార్గం కూడా లేకపోవడంతో పుణెలోని తన స్నేహితురాలి దగ్గరకు చేరింది సోనియా.

అయితే అప్పుడే జంషెడ్ పూర్ లోని తన కొడుకు అనారోగ్యం బారిన పడ్డాడని ఆమెకు తెలిసింది. దీంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. పుణె నుంచి జంషెడ్ పూర్ కి 1800కిలోమీటర్ల దూరం. ఫ్లైట్ ఎక్కే స్థోమత లేదు, అక్కడినుంచి రైలుబండి సౌకర్యం లేదు, ప్రజా రవాణా అందుబాటులో లేదు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే ఎప్పటికి చేరుకుంటారో తెలియదు. దీంతో తన స్నేహితురాలితో కలసి స్కూటీపై జంషెడ్ పూర్ కి బయలుదేరింది సోనియా. 1800కిలోమీటర్ల దూరాన్ని 5రోజుల్లో వీరు చేరుకున్నారు. కన్నకొడుకుని కళ్లారా చూసుకున్న తర్వాత కానీ సోనీయా మనసు కుదుటపడలేదు. స్థానిక వైద్య సిబ్బంది సోనియా, ఆమె స్నేహితురాలికి కొవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ రావడంతో.. సంతోషంగా కొడుకుని దగ్గరకు తీసుకుంది సోనియా