భూకబ్జా కేసులో పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఎట్టకేలకు దొరికాడు. కొంతకాలంగా జంగాపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో వరంగల్‌ అర్బన్‌ జిల్లా టేకులగూడెంలోని ఆయన నివాసంలో గురువారం ఆదుపులోకి తీసుకున్నారు. టేకులగూడెం సమీపంలోని తన భూమిని జంగా రాఘవరెడ్డి దౌర్జనంతో కాజేసి, ఓ గదిలో బంధించి సెల్‌ఫోన్‌ ధ్వంసం చేసి కొట్టాడని కాజీపేట మండలం ప్రశాంత్‌నగర్‌కు చెందిన తంగళ్లపల్లి సమ్మయ్య నవంబర్‌ 4న మడికొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. ఈ నేపథ్యంలో జంగాపై అదే స్టేషన్‌లో ఐపీసీ 327, 447, 352, 365, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన జంగా కోర్టును ఆశ్రయించాడు. అయితే అప్పటికే అతడిపై రౌడీషీట్‌ ఉండడం, తీవ్ర నేరచరిత్ర కలిగి ఉండటంతో జిల్లా ప్రధాన కోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. అప్పటినుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. గురువారం పక్కా సమాచారంతో మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

ఇన్ని రోజులు పలుకుబడితో అందరినీ మేనేజ్‌ చేసిన జంగా ఈసారి ఊచలు లెక్కించడం ఖాయమని సొంతపార్టీలోనే చర్చ జరుగుతోంది. జంగాపై నమోదైన కేసు విషయంలో స్థానిక పోలీసులు సమాచా రం అందించినా స్టేషన్‌కు రాకపోవడంతో ఉన్నతాధికారి రంగంలోకి దిగాడు. కాగా సదరు అధికారిని ఇంట్లోకి రానివ్వకుండానే తన మనుషులతో భయబ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర అవమానానికి గురైన ఆ అధికారి బెయిల్‌ దొరకుండా కేసు పక్కాగా పెట్టినట్టు చర్చ జరుగుతోంది. బెయిల్‌ తిరస్కరించిన తర్వాత కూడా సదరు అధికారిని జంగా మనుషులు బెదిరించినట్లు తెలిసింది.