ఎంతో మోజు పడి కొన్న ఖరీదైన కొత్త సూపర్ స్పోర్ట్స్‌ కారు, చేతికి తాళం అందగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందం, కళ్ల ముందు తన కలల కారులో ప్రయాణాన్ని ఊహించకుంటూ షోరూం నుంచి రోడ్డు మీదకి వచ్చాడు. కొద్ది దూరం ప్రమాణం సాఫీగానే సాగింది, అంతలోనే కారులో ఏదో సాంకేతిక సమస్య. ఏం జరిగిందో చూద్దామని రోడ్డుపై ఆపాడు. కారులోంచి దిగి పరిశీలించేలోపే డబ్‌మని ఓ పెద్ద శబ్దం, వెనక్కి తిరిగి చూస్తే ఏముంది ? తను ఎంతో ముచ్చటపడి కొన్న ఖరీదైన కారును వెనక నుంచి వచ్చిన మరో కారు డీకొట్టింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ పోలీసులకు సమాచారం అందించాడు సదరు కారు యజమాని.

బ్రిటన్‌లోని వేక్‌ఫీల్డ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే: ఓ వ్యక్తి సుమారు రూ.2 కోట్లు విలువైన గ్రే కలర్‌ లంబోర్గిని హరికేన్‌ స్పైడర్‌ మోడల్ కారును కొనుగోలు చేశాడు. షోరూం నుంచి డెలివరీ తీసుకుని కొంత దూరం ప్రయాణించేసరికి కారులో సాంకేతిక లోపం తలెత్తి రోడ్డుపైనే ఆగిపోయింది. కారుని పక్కకు తీసేలోపే వెనక నుంచి వేగంగా వచ్చిన మరో కారు దాన్ని ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం మొత్తం పూర్తిగా దెబ్బతింది. కారు కొన్న 20 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఎంతో ఆవేదనకు గురైన ఆ వ్యక్తి పోలీసులకు అందించాడు. కారు ప్రమాదానికి గురైన ఫొటోలను స్థానిక పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ‘‘ఏడ్చిన కారు ఏదైనా ఉందంటే అది ఇదే’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కారు యజమాని దురదృష్టానికి జాలి పడుతూ కామెంట్లు పెడుతున్నారు.