పిల్లలు ‘అమ్మా ఆకలి’ అని అడగ్గానే తల్లి ఏ పనిలో ఉన్నా వదిలేసి అన్నం పెడుతుంది. బిడ్డ బొజ్జ నిండిందో లేదోనని ‘ఇంకొంచెం తిను..’ అని అడిగి అడిగి పెడుతుంది. కళావతి కూడా లాక్ డౌన్ ముందు వరకు తన పిల్లలకు అలాగే తినిపించేది. కానీ లాక్‌డౌన్ ఆమె కుటుంబాన్ని ఛిద్రం చేసింది. పనుల్లేక పిల్లలు ఆకలితో అల్లాడిపోయారు. నాలుగు రోజులుగా తిండి లేక నాలుగేళ్ల కూతురు ప్రాణం విడిచింది.

జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దళితవర్గానికి చెందిన కళావతి భర్త జగ్గాల్ భుయాల్ వలస కార్మికుడు. సొంతూరులో కాకుండా వేరే ఊరిలో ఇటుకల బట్టీలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ వల్ల బట్టీని మూసేయడంతో పని లేకుండా పోయింది. భుయాల్ అక్కడే చిక్కుకుపోయాడు. అతనికి 8 మంది పిల్లలు. కళావతి వాళ్లనూ వీళ్లను అడిగి కొంత పిండి, బియ్యం సేకరించి, అప్పులు చేసి పిల్లలకు పెడుతూ వస్తోంది.

జన్ ధన్ ఖాతా కింద రూ. 500 డబ్బులు, అంగన్ వాడీ వాళ్లు ఇచ్చిన చారెడు బియ్యం తప్ప ప్రభుత్వం నుంచి మరే సాయమూ అందలేదు. రేషన్ కార్డు కూడా లేకపోవడంతో ధాన్యం దొరక్క పిల్లలను నీళ్లు తాగించి పడుకోబెడుతోంది. శనివారం నిమని అనే కూతురు ఆకలితో పూర్తిగా నీరసించి స్పృహ తప్పింది. లాక్ డౌన్ లేకపోయింటే పిల్లలు స్కూలు వెళ్లి మధ్యాహ్న భోజనం తినేవారని, ఇప్పుడదీ లేకపోవడంతో పస్తులు ఉంటున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేసింది.