దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ముఖ్యమైన కేసులతో ఏడాది మొత్తం బిజీగా ఉంటుంది. మైలురాయి లాంటి కేసుల విచారణలు, తీర్పులతో ఈ ఏడాది సుప్రీంకోర్టు సమయం అత్యంత బిజీగా గడిచిందనే చెప్పాలి. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో 2019కి ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత క్లిష్టమైన పలు కేసులలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది తీర్పులు చెప్పింది.

దశాబ్దాల నాటి రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు, భారత ప్రధాన న్యాయమూర్తిని ఆర్టీఐ కిందకు తీసుకురావడం, రఫెల్ తీర్పు, లక్షల మందికి ఉచిత న్యాయ సహాయం,శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష, ఆర్టికల్ 370 రద్దు, తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతించడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి,

  1. అయోధ్య భూ వివాదం:
    భారత సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం (40 రోజులు) వాదనలు విన్న రెండో కేసు ఇది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించేందుకు అనుమతిస్తూ నవంబర్-9,2019న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వడంతో దశాబ్దాలుగా నలుగుతున్న, వివాదాస్పదమైన బాబ్రీ మసీదు- రామ జన్మభూమి కేసు ముగిసింది. ఆ వివాదాస్పద స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం రామ్ లల్లాకు న్యాయస్థానం అప్పగించింది. అలాగే, మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో 5ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యంత సున్నితమైన ఈ కేసులో తుది వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వం వహించారు. సుప్రీం తీర్పు అనంతరం పలు రివ్యూ పిటిషన్లు దాఖలవగా వాటన్నింటిని జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2019 డిసెంబర్ 12న కొట్టివేసింది.
  2. శబరిమల ఆలయ రివ్యూ:
    శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి సంబంధించిన ఈ కేసులో మహిళల పట్ల వివక్ష చూపించొద్దని, ఆ ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ వెళ్లి పూజలు చేసుకోవచ్చు అంటూ 2018 సెప్టెంబర్‌ 28న అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్పును మరోసారి సమీక్షించాలంటూ దాదాపు 60 దాకా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై విచారణను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తూ 2019 నవంబర్‌ 14న సుప్రీంకోర్టు నిర్ణయించింది. గతంలో తాము ఇచ్చిన తీర్పుపై స్టే ఏమీ లేదని స్పష్టం చేసింది. శబరిమల ఆలయ నిర్వహణకు సంబంధించి 2020 జనవరిలోగా ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
  3. రఫేల్ రివ్యూ:
    ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసే ఒప్పందాన్ని మోడీ సర్కార్ ఖరారు చేసిన తరువాత, ఆ ఒప్పందంలో సరైన విధానాలు పాటించలేదంటూ విపక్షాలు ఆరోపణలు చేశాయి. అందులో అవినీతి జరిగిందని ఆరోపించాయి. విమానాల కొనుగోలులో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు దాఖలయ్యాయి. అయితే రాఫెల్ యుద్ధ విమానాల ధరలపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం 2018 డిసెంబర్-14న స్పష్టం చేసింది. రాఫెల్‌ ఒప్పందాన్ని లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. యుద్ధ విమానాల ధరలను విచారించడం కోర్టు పని కాదని జస్టిస్ గొగోయ్ అన్నారు. అయితే 2018 డిసెంబర్-14న సుప్రీం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను 2019 నవంబర్ లో కోర్టు కొట్టివేసి మోడీ సర్కార్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.
  4. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం:
    భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాలా? పారదర్శకంగా పనిచేయడంలేదన్న అభియోగాలు ఎదుర్కొంటున్న అత్యున్నత న్యాయస్థానాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న అది. చివరికి, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం కిందకు తెస్తూ 2019 నవంబర్ 13న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. సీజే కార్యాలయం కూడా న్యాయవ్యవస్థలో ఒక భాగంగా ఉంది కనుక, సీజే తదితర న్యాయమూర్తులతో కలిపి ఉన్న వ్యవస్థ న్యాయవ్యవస్థ అని రాజ్యాంగ అధికరణ 124లో ఉంది కనుక, మొత్తం న్యాయవ్యవస్థ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, సీజే కార్యాలయం సమాచారం ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ధర్మాసనం వివరించింది.
  5. సహజీవనంలో సెక్స్ రేప్ కాదు:
    సహజీవనం (లైవ్-ఇన్-పార్టనర్స్) చేస్తున్న వారి మధ్య పరస్పర అంగీకారంతో చేసే సెక్స్ అత్యాచారం కిందకు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రలో ఓ వైద్యుడిపై ఒక నర్సు వేసిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.
  6. ఆర్టికల్ 370(కశ్మీర్):
    జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 నిబంధనను మోడీ సర్కార్ రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీతో కూడాన కేంద్రపాలితంగా, లఢక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటాయని ప్రకటించిన తరువాత, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020 ప్రారంభంలో ఆ విచారణలను ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్‌లో ఉద్యమాలపై ఆంక్షలు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, పత్రికా స్వేచ్ఛ, కమ్యూనికేషన్ సేవలపై ఆంక్షలు వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లు కూడా అందులో ఉన్నాయి.