అభం శుభం తెలియని 35 మంది చిన్నారులతో సహా 40 మంది పురుషులు, ట్రాన్స్‌జెండర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్‌ చేసి విచారించిన పోలీసులు ఈ విస్తు గొలిపే విషయాన్ని బయటపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌లోని శాస్త్రీనగర్‌ చెందిన ఏడేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు(35) ముసుగు ధరించడంతో సీసీ కెమెరా పుటేజీ ద్వారా కూడా పోలీసులు అతన్ని గుర్తించలేకపోయారు. అయితే అతని బైక్‌ను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా విచారణ చేపట్టారు.

గతంలో జరిగిన అత్యాచార ఘటనల్లో కూడా అదే బైక్‌ కనిపించడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మూడు రోజుల క్రితం అదే బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తమ విచారణలో భయంకరమైన విషయాలు వెలువడ్డాయని సీనియర్‌ పోలీసు అధికారి శ్రీవాత్సవ పేర్కొన్నారు. ‘బైక్‌ ఆధారంగా నిందితున్ని గుర్తించాం. గతంలో జరిగిన అత్యాచార ఘటనల్లో కూడా ఇలాంటి వాహనాన్నే మేం గుర్తించాం. దీంతో ఆ కోణంలో నిందితుడిని విచారించాం. గతంలో ఈ కామాంధుడు 35 మంది చిన్నారులు, 40 మంది పురుషులు, ట్రాన్స్‌జెండర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్న పిల్లలను అపహరించి అమ్ముకుంటూ వచ్చే డబ్బుతో జల్సాలు చేసే వాడు. మద్యం, సెక్స్‌కు బానిసైన ఈ వ్యక్తి పురుషులు, ట్రాన్స్‌జెండర్లు అనే తేడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో కూడా ఇతని పై పలు కేసులు నమోదయ్యాయి. నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించాం’ అని పోలీసులు అధికారి శ్రీవాత్సవ మీడియాకు తెలిపారు.