సంఘవి, శ్రీకాంత్ హీరోగా నటించిన ‘తాజ్ మహల్’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ. సంఘవి అసలు పేరు కావ్య. ‘అమరావతి’ అనే తమిళ సినిమాలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం’ చిత్రంలో అమాయకపు అమ్మాయిగా కనిపించి అదరగొట్టింది. ‘సీతారామరాజు’ ‘ఆహ’ ‘సూర్య వంశం’ ‘మృగరాజు’ ‘సమరసింహారెడ్డి’ ‘గొప్పింటి అల్లుడు’ ‘ప్రేయసి రావే’ ‘సందడే సందడి’ ‘రవన్న’ ‘శివయ్య’ ‘తాతా మనవడు’ ఇలా సుమారు నలభై దాకా తెలుగు సినిమాల్లో నటించింది. 15 ఏళ్లకు పైగా ఉన్న తన సినీ కెరీర్ లో సౌత్ ఇండియాలోని తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నటించి అలరించింది.

టాలీవుడ్ లో నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ రవితేజ ఎన్టీఆర్ రాజశేఖర్ శ్రీకాంత్ వంటి హీరోల సరసన నటించి తెలుగమ్మాయే అనుకునేంతలా టాలీవుడ్ లో పాతుకుపోయింది. 2004లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమాలో నటించిన సంఘవి ఆ తర్వాత ‘ఒక్కడే కానీ ఇద్దరు’ అనే తెలుగు సినిమాలో స్పెషల్ రోల్ చేసినది. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కానీ కొన్ని కన్నడ తమిళ చిత్రాల్లో మాత్రం నటించింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన సంఘవి మెల్ల మెల్లగా సినిమాలకు దూరమవుతూ వచ్చింది.

39 ఏళ్ళ వయసులో 2016లో వెంకటేశ్ అనే ఐటీ సంస్థ యజమానిని సంఘవి వివాహం చేసుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ షోకి కొన్ని ఎపిసోడ్స్ కి జడ్జ్ గా వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే సంఘవి ఇప్పుడు ఒక పాపకి జన్మనిచ్చింది. తన బిడ్డతో కలిసి సంఘవి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. సంఘవి ఈ ఫోటోలో తన బిడ్డని ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉంది. సంఘవి ప్రస్తుత వయసు 42 ఏళ్ళు. ఈ వయసులో ఆమె తల్లి కావడంతో అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురైనప్పటికీ తను బిడ్డకి జన్మనిచ్చినందుకు ఆనందంగా ఉన్నారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.