బంగారం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటిదాకా చిత్రవిచిత్రమైన కేసులు ఎన్నో చదివుంటాం. కానీ తొలిసారి ఒళ్లు గగుర్పొడిచే రీతిలో గర్బిణి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియాలో మహిళలూ కీలక పాత్రధారులుగా ఉంటోన్న క్రమంలో ప్రైవేటు శరీర భాగాల్లో బంగారాన్ని దాచుకొని కస్టమ్స్ కు దొరికిపోయిన ఉదంతాలు ఆఫ్రికాలో తరచూ జరుగుతుంటాయి. మన దేశంలోనూ ఇటీవల అలాంటి కేసులుపెరుగుతున్నాయి. అయితే నిజంగా గర్బిణి అయిఉండి అలాంటిపని చేసి అడ్డంగా బుక్కైందో మహిళ. కడుపులో ఐదు నెలల శిశువును పెట్టుకొని ఆరోగ్యాన్ని పణంగాపెట్టి మలద్వారంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన సర్వత్రా సంచలనం రేపింది. వివరాలుః ప్రవాసులు ఎక్కువగా ఉండే కేరళ అయితే గోల్డ్ స్మగ్లింగ్ కు కేరాఫ్ గానూ మారింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ సంబంధిత కేసుల్లో సీఎం, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైనా సంచలన ఆరోపణలున్నాయి. కాగా, కరిపూర్ లోని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం వెలుగు చూసిన కేసు మరింత షాకింగ్ అనిపిస్తుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా సిటీ నుంచి కేరళలోని కాలికట్ విమానాశ్రయంలో ల్యాండైన విమానంలో భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా జరిగింది.

ఇద్దరు ప్రయాణికుల నుంచి ఏకంగా 7 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరీ దారుణంగా 5 నెలల గర్బిణి అయిన నిందితురాలు, ఆమె భర్త తమ మలద్వారం, లోదుస్తుల్లో ద్రవరూపంలోని బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు. నిందితులను అబ్దుల్ సమద్, అతని భార్య సాఫ్నా సమద్ లను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీస్ రిమాండ్ కు తరలించారు. అమ్మినిక్కడ్​కు చెందిన వీరిద్దరూ సౌదీ నుంచి బంగారాన్ని లిక్విడ్ పేస్ట్ గా మార్చి స్మగ్లింగ్ చేశారు. సాఫ్నా ఐదు నెలల గర్భంతో ఉండి ఇలాంటి పని చేయడం షాకింగ్ గా ఉందని, గర్భవతి కాబట్టి చికిత్స కోసం వెళుతున్నట్లు సులువుగా తప్పించుకోవచ్చనే ఆమె రిస్క్ చేసిందని అధికారులు వ్యాఖ్యానించారు. సాఫ్నా దంపతులు పట్టుకొచ్చిన బంగారం విలువ సుమారు రూ.3.25కోట్లు అని, నిందితులిద్దరినీ అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు.