సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా హేమ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. కొన్ని వందల చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారామె. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం యూత్‌లోనూ మంచి పాపులారిటీ సంపాదించారు. ఇన్నాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న హేమ.. ఇప్పుడు చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే, దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసేందుకు ఆమె అర్హత పరీక్ష రాశారు. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇటీవల జరిగిన అర్హత పరీక్షకు ఆమె హాజరయ్యారు.

ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ద్వారా హేమ తన డిగ్రీని పూర్తి చేయనున్నారు. పరీక్ష ఫలితాలు ఆన్‌లైన్‌లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ధర్మానాయక్‌ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన కేంద్రంలో ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్‌ పొందవచ్చని తెలిపారు. అంటే, హేమ త్వరలోనే డిగ్రీలో చేరతారన్నమాట. 53 ఏళ్ల వయసులోనూ చదువు కోసం ఆరాటపడుతోన్న హేమను అభినందించాల్సిందే.